London: నవాజ్ షరీఫ్‌కు దెబ్బ మీద దెబ్బ.. మనవళ్లను అరెస్ట్ చేసిన లండన్ పోలీసులు

  • ఇంటి బయట ఆందోళన చేస్తున్న వ్యక్తిపై దాడి
  • లాగి పడేసి పిడిగుద్దులు
  • అరెస్ట్ చేసిన పోలీసులు

పాక్ మాజీ ప్రధాని నవా‌జ్ షరీఫ్‌కు కష్టాలు ఒక్కొక్కటిగా వచ్చి మీద పడుతున్నాయి. అక్రమాస్తుల కేసులో పీకలోతు కష్టాల్లో కూరుకుపోయి దోషిగా తేలిన ఆయనకు ఇటీవల కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. కుమార్తె మర్యం నవాజ్‌తో పాటు అల్లుడికి కూడా శిక్షలు విధించింది. అనారోగ్యంతో బాధపడుతూ లండన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భార్యను చూసేందుకు లండన్ వచ్చిన నవాజ్ ప్రస్తుతం అక్కడే ఉన్నారు.

తన ఫ్లాట్ వెలుపల ఓ వ్యక్తిపై దాడిచేసి పిడిగుద్దులు కురిపించారన్న ఆరోపణలతో షరీఫ్ మనవళ్లను లండన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లండన్‌లోని పార్క్ లేన్‌లో షరీఫ్ కుమారుడికి సొంత ఫ్లాట్ ఉంది. గతవారం షరీఫ్‌కు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పిన తర్వాత లండన్‌లోని ఆయన కుమారుడి ఫ్లాట్ వద్ద నవాజ్ మద్దతు దారులు, వ్యతిరేకులు అక్కడికి చేరుకుని పరస్పరం నినాదాలు చేస్తున్నారు.

తాజాగా గురువారం అక్కడికి చేరుకున్న  ఓ వ్యక్తి షరీఫ్ మనవళ్లు జునైద్ సఫ్దార్, జకారియా షరీఫ్‌లను ఉద్దేశిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ నిరసన ప్రదర్శన చేశాడు. దీంతో అతడిని పట్టుకున్న షరీఫ్ మనవళ్లు ఈడ్చి పడేశారు. పిడిగుద్దులు కురిపించారు. నవాజ్ కుమార్తె మర్యం కుమారుడే జునైద్ కాగా, జకారియా.. నవాజ్ కుమారుడు హుస్సేన్ కుమారుడు. కాగా, వ్యక్తిపై దాడిచేసి గాయపరిచిన జునైన్, జకారియాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు సమీపంలోని కోర్టులో ప్రవేశపెట్టారు.

More Telugu News