Paripoornananda: ఒకరికి ఒకరు సపోర్ట్... కత్తి మహేష్ బహిష్కరణను ఖండించిన పరిపూర్ణానంద!

  • బహిష్కరణ వేటును విజ్ఞతకే వదిలేస్తున్నా
  • 300 గ్రామాలను దత్తత తీసుకుని సేవ చేస్తున్నా
  • అనుచిత వ్యాఖ్యలకు దారితీసిన పరిస్థితులను గమనించండి

తనపై బహిష్కరణ వేటును తెలంగాణ ప్రభుత్వ విజ్ఞతకే వదిలేస్తున్నానని శ్రీపీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామి వ్యాఖ్యానించారు. కాకినాడ శివార్లలోని సర్పవరం జంక్షన్ వద్ద తన ఆశ్రమంలో మీడియాతో మాట్లాడిన ఆయన, కత్తి మహేష్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను బహిష్కరించడం సరికాదని అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి, సుప్రభాతం తదితరాలపై బాబు గోగినేని అనుచిత వ్యాఖ్యలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.

తాను 300 గ్రామాలను దత్తత తీసుకుని, వెనుకబడ్డ ప్రాంతాల్లోని పిల్లలకు దేశభక్తిని బోధిస్తున్నానని, వందల ఆవులను, ఎద్దులను రైతులకు దానం చేశానని చెప్పారు. అందుకు ప్రతిగా తనను విద్రోహశక్తిగా ముద్ర వేశారని, అనుచిత వ్యాఖ్యలకు దారితీసిన పరిస్థితులను గుర్తించాలని ఆయన అన్నారు. కాగా, నిన్న కత్తి మహేష్ సైతం పరిపూర్ణానంద బహిష్కరణ సరికాదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి నగర బహిష్కరణకు గురైన ఇద్దరూ ఇలా ఒకరికి ఒకరు మద్దతుగా మాట్లాడుకోవడం గమనార్హం.

More Telugu News