బీజేపీతో పొత్తు ఉండబోదని తేల్చి చెప్పిన శివసేన.. 'సామ్నా'లో సంపాదకీయం!
- పాల్ఘర్ ఉప ఎన్నికల ఫలితాలు మా శక్తిని నిరూపించాయి
- సొంతంగానే 2019 సాధారణ ఎన్నికల్లో పోటీ చేస్తాం
- పార్టీ పత్రిక సామ్నాలో శివసేన స్పష్టీకరణ
సంపర్క్ ఫర్ సమర్థన్ పేరుతో దేశవ్యాప్తంగా పలు వర్గాలు, పార్టీల మద్దతు కూడగట్టేందుకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కార్యక్రమం చేపట్టిన విషయం విదితమే. ఇందులో భాగంగానే షా ఈ రోజు బాలీవుడ్ బ్యూటీ మాధురీదీక్షిత్ ను సైతం ముంబైలో కలుసుకున్నారు. అయితే, తాజా సామ్నా సంపాదకీయం ఈ కార్యక్రమాన్ని సైతం తప్పుబట్టింది.
‘‘ఇటీవలి ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత బీజేపీ ఎందుకని సంపర్క్ ఫర్ సమర్థన్ కార్యక్రమం చేస్తోంది? శివసేన 2019 సాధారణ ఎన్నికలను సొంతంగానే ఎదుర్కొంటుంది. పాల్ఘర్ ఉప ఎన్నిక పార్టీ శక్తి ఏంటో నిరూపించింది. బీజేపీ అధికారంలో ఉండి కూడా ప్రజలతో సంబంధాలను కోల్పోయింది. కానీ, శివసేన ప్రజలతో మమేకమవుతూ, ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తోంది. కనుక ఎన్నికల్లో గెలుపొందేందుకు ఏ పోస్టర్ బోయ్ అవసరం లేదు’’ అని సామ్నాలో శివసేన స్పష్టం చేసింది.