'ఇదే నా ఆఖరి ఎన్నిక' అంటూ పాతపాటే పాడిన సిద్ధరామయ్య!
- మరోసారి ఎన్నికల్లో పోటీ పడబోను
- అధిష్ఠానం ఆదేశాల మేరకే ఈ దఫా పోటీ
- చాముండేశ్వరిలో సిద్ధరామయ్య
ఈ ఎన్నికల్లోనూ పోటీ పడాలని తాను భావించలేదని, అయితే, పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యతను కాంగ్రెస్ అధిష్ఠానం తనపై వేసిందని, అందువల్లే తాను పోటీ పడాల్సి వచ్చిందని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. చాముండేశ్వరి ప్రాంతంలో ర్యాలీ నిర్వహించిన ఆయన, అక్కడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ స్థానం నుంచి సిద్ధరామయ్య స్వయంగా పోటీపడుతున్న సంగతి తెలిసిందే.
1983లో చాముండేశ్వరి నుంచి లోక్ సభకు తొలిసారిగా ఎన్నికైన ఆయన, ఆపై ఇక్కడి నుంచి 5 సార్లు విజయం సాధించి, రెండు సార్లు ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇక తన రాజకీయ ప్రస్థానం చాముండేశ్వరిలోనే మొదలైందని, తన కెరీర్ కూడా ఇక్కడి నుంచే ముగించాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ పోటీ చేస్తున్నానని ఈ సందర్భంగా సిద్ధరామయ్య పేర్కొనడం గమనార్హం.