Tirumala: తిరుమలలో అనూహ్యంగా పెరిగిన రద్దీ... దర్శనానికి 16 గంటలు... కారణమిదే!

  • సర్వదర్శనానికి 16 గంటల సమయం
  • వేసవి సెలవులు, పుత్తాండు పర్వదినం
  • ఇంటర్ ఫలితాలు వెల్లడి కావడంతో పెరిగిన రద్దీ
  • నేటి రాష్ట్ర బంద్ తో భక్తుల ఇబ్బందులు

తిరుమలలో యాత్రికుల రద్దీ గణనీయంగా పెరిగింది. సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతుండగా, వైకుంఠంలోని క్యూ కాంప్లెక్స్ పూర్తిగా నిండి, క్యూలైన్ బయట రెండు కిలోమీటర్ల మేరకు ఉంది. వేసవి సెలవులకు తోడు తమిళ నూతన సంవత్సర పండగ 'పుత్తాండు', ఇంటరు పరీక్ష ఫలితాలు వెల్లడి కావడం, తదితర కారణాలతో ఆదివారం రాత్రి భక్తుల రద్దీ రెట్టింపయింది. కాలినడక భక్తుల దివ్య దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.

క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలుగకుండా చూసుకుంటున్నామని, వారికి అన్న పానీయాలను అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఇదిలావుండగా, నేటి బంద్ శ్రీవారి భక్తులపై ప్రభావం చూపుతోంది. ఈ ఉదయం దర్శనం అనంతరం కొండ దిగివచ్చిన వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముందుగా ప్రణాళిక వేసుకున్న ప్రకారం, తాము శ్రీకాళహస్తి, కాణిపాకం తదితర ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నామని పలువురు భక్తులు వాపోయారు. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే బస్సులు మినహా మరే ఇతర సర్వీసులు నడవని పరిస్థితి నెలకొంది.

More Telugu News