kcr: రాష్ట్రాభివృద్ధి కోసం అప్పులు చేయడంలో తప్పు లేదు: సీఎం కేసీఆర్

  • అప్పులు తీసుకోవడం బుద్ధి తక్కువ ఆలోచనేమీ కాదు
  • అలా తీసుకోవడం బడ్జెట్ లో భాగమే
  • అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రాలు అప్పులు చేయడం లేదా?
  • తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్

తెలంగాణ రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం కోసం అప్పులు చేయడం తప్పు కాదని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, అప్పులు తీసుకోవడం బుద్ధి తక్కువ ఆలోచనేమీ కాదని, అప్పులు తీసుకోవడం బడ్జెట్ లో భాగమని అన్నారు. అప్పులు తీసుకుంటున్నామంటూ బీజేపీ సభ్యులు అనవసర వ్యాఖ్యలు చేయడం సబబు కాదని, అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రాలు అప్పులు చేయడం లేదా? అప్పులు చేయకుండానే ఆ రాష్ట్రాలు పరిపాలనను కొనసాగిస్తున్నాయా? అని ప్రశ్నించారు.

తమ పరిమితికి లోబడి మాత్రమే అప్పులు చేస్తున్నామని, తెలంగాణ జీఎస్ డీపీలో 21 శాతం అప్పులు ఉన్నాయని అన్నారు. రాష్ట్రం కంటే కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులే ఎక్కువని అన్నారు. 22 శాతం వృద్ధి రేటుతో దేశంలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ గా ఉందని అన్నారు. బడ్జెట్ పై చర్చకు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సరిగ్గా సమాధానం ఇస్తున్నారని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రశంసించారు. ఈ నాలుగేళ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క మంచి పని చేయలేదంటున్న ప్రతిపక్షాలపై కేసీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. 

More Telugu News