mohammad shami: షమి దుబాయ్ లో రెండు రోజులున్నాడని కోల్ కతా పోలీసులకు తెలిపిన బీసీసీఐ

  • సౌతాఫ్రికాలో షమీ పర్యటన వివరాలు అందించాలని బీసీసీఐ ని కోరిన కోల్ కతా పోలీసులు
  • షమీ పర్యటన వివరాలు అందించిన బీసీసీఐ
  • ఫిబ్రవరి 17, 18 తేదీల్లో షమీ దుబాయ్ లో గడిపాడని స్పష్టీకరణ

గత ఫిబ్రవరిలో టీమిండియా పేసర్‌ మహమ్మద్‌ షమీ దుబాయ్‌ లో రెండు రోజులు గడిపాడని బీసీసీఐ కోల్ కతా పోలీసులకు సమాచారమిచ్చింది. దక్షిణాఫ్రికా పర్యటన ముగించుకుని భారత్ రావాల్సిన షమీ, దుబాయ్ వెళ్లాడని, అక్కడ పాకిస్థాన్‌ కు చెందిన అలిష్బా అనే మహిళ నుంచి డబ్బులు తీసుకున్నాడని షమీ భార్య హసీన్‌ జహాన్‌ ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ ఆరంభించిన కోల్ కతా పోలీసులు, షమీ పర్యటన వివరాలు ఇవ్వాలంటూ బీసీసీఐకి లేఖ రాశారు. దానికి స్పందించిన బీసీసీఐ, షమీ పర్యటన వివరాలు కోల్ కతా పోలీసులకు అందించింది.

 ఆ లేఖలో ఫిబ్రవరి 17, 18తేదీల్లో మహమ్మద్‌ షమీ దుబాయ్‌ లో ఉన్నాడని బీసీసీఐ పేర్కొందని కోల్ కతా జాయింట్‌ సీపీ ప్రవీణ్‌ త్రిపాఠి తెలిపారు. దీనిపై తదుపరి విచారణ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. షమీ కుటుంబ సభ్యులు తనకు నిద్రమాత్రలు ఇచ్చి హతమార్చే ప్రయత్నం చేశారన్న హసీన్ జహాన్ ఆరోపణలపై విచారణ ప్రారంభించినట్టు బీసీసీఐ తెలిపింది. ఆ సమయంలో ఆమెకు చికిత్స చేసిన వైద్యుడిని బీసీసీఐ అధికారులు కలవనున్నట్టు తెలుస్తోంది.

More Telugu News