India: చివరి బంతికి సిక్స్ కొట్టి భారత్‌ను గెలిపించిన దినేశ్ కార్తీక్.. మనదే ముక్కోణపు టోర్నీ!

  • ఉత్కంఠ పోరులో భారత్ విజయం
  • చివరి బంతి వరకు విజయం దోబూచులాట
  • 8 బంతుల్లో 29 పరుగులు చేసిన కార్తీక్

నిదహాస్ ట్రోఫీలో భాగంగా  భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఫైనల్ పోరును చూసిన వారు క్రికెట్‌లోని అసలైన మజాను ఆస్వాదించారు. చివరి బంతి వరకు నువ్వా? నేనా? అన్నట్టు సాగిన ఆటలో ప్రేక్షకులు ఊపిరి బిగబట్టి మరీ చూశారు. చివరి బంతికి టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్ సిక్సర్ కొట్టి భారత్‌కు అపురూప విజయాన్ని అందించాడు. ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

శ్రీలంకపై గెలిచిన ఉత్సాహంతో ఉన్న బంగ్లాదేశ్ ఫైనల్‌లో గెలిచి కప్పు కొట్టుకెళ్లాలని భావించింది. తొలి నుంచి ఆచితూచి ఆడింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీస్తున్నా స్కోరు వేగం మందగించకుండా బంగ్లా బ్యాట్స్‌మన్ జాగ్రత్త పడ్డారు. ఒకవైపు వరుసగా వికెట్లు పడుతున్నా షబ్బీర్ రహ్మాన్ మాత్రం ధాటిగా ఆడాడు. 50 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో వీరవిహారం చేశాడు. సహచరులు ఒక్కొక్కరుగా పెవిలియన్ చేరుతున్నా షబ్బీర్ మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. చివరికి ఉనద్కత్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయి ఏడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు.

అప్పటికి బంగ్లాదేశ్ చేసినవి 147 పరుగులే. ఇంకా పది బంతులు మాత్రమే మిగిలి ఉండడంతో బంగ్లాదేశ్ 150-155 పరుగులు మాత్రమే చేస్తుందని భావించారు. చివర్లో  శార్దూల్ ఠాకూర్ తడబడి ఏకంగా 18 పరుగులు సమర్పించుకోవడంతో బంగ్లాదేశ్ 166 పరుగులు చేసింది. భారత బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ 3 వికెట్లు తీయగా, ఉనద్కత్ 2, వాషింగ్టన్ సుందర్‌కు ఒక వికెట్ దక్కాయి.

అనంతరం 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ సునాయాసంగా గెలుస్తుందని అందరూ భావించారు. అయితే 32 పరుగుల వద్ద శిఖర్ ధవన్ (10), 32 పరుగుల వద్ద సురేశ్ రైనా (0) అవుటవడంతో భారత శిబిరంలో ఆందోళన మొదలైంది. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ 42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 56 పరుగులు చేసి స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. అతడికి తోడుగా కేఎల్ రాహుల్ (24) ఉండడంతో భారత్ విజయం నల్లేరు మీద నడకేనని భావించారు.

83 పరుగుల వద్ద రాహుల్ అవుటవడంతో భారత్ తడబడింది. మరోవైపు బంగ్లా బౌలర్లు పట్టుబిగించడంతో విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. ఆ తర్వాత రోహిత్ శర్మ, మనీశ్ పాండే (28), విజయ్ శంకర్ (17) కూడా త్వరత్వరగానే పెవిలియన్ చేరడం, సాధించాల్సిన రన్‌రేట్ పెరిగిపోవడంతో ఒక్కసారిగా టెన్షన్ పెరిగింది. పాండే అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ మ్యాచ్ గతిని మార్చేశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్ కొట్టి టెన్షన్ తగ్గించే ప్రయత్నం చేశాడు.

చివరి రెండు ఓవర్లలో భారత్ విజయానికి 34 పరుగులు కావాల్సిన తరుణంలో కార్తీక్ రెచ్చిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. భారత్ విజయానికి ఇంకా ఐదు పరుగులు కావాల్సి ఉండగా, మిగిలింది ఒక్కటే బంతి. క్రీజులో ఉన్న దినేశ్ కార్తీ క్ ఎక్స్‌ట్రా కవర్ మీదుగా సిక్సర్ కొట్టి భారత్‌కు అపురూప విజయాన్ని అందించాడు. మొత్తం 8 బంతుల్లో 2 ఫోర్లు, మూడు సిక్సర్లతో 29 పరుగులు చేశాడు. భారత్‌ను గెలిపించిన కార్తీక్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కగా, వాషింగ్టన్ సుందర్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది.

More Telugu News