Mohammad shami: కూర్చుని మాట్లాడుకుందాం.. భార్యతో చర్చలకు ముందుకొచ్చిన టీమిండియా పేసర్ షమీ

  • వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకునేందుకు రెడీ
  • హసీన్ తరపు లాయర్‌ను కలిసిన షమీ కుటుంబ సభ్యులు
  • తప్పు ఒప్పుకుంటే కలిసి ఉండేందుకు సిద్ధమేనన్న హసీన్

టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ ఎట్టకేలకు ముందుకొచ్చాడు. భార్య హషీన్ జహాన్ తనపై చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో వివాదాన్ని పరిష్కరించుకునేందుకు తొలి అడుగు వేశాడు. కోర్టు బయట సమస్యను పరిష్కరించుకునే ఉద్దేశం ఉన్నట్టు చెప్పాడు. ఈ మేరకు షమీ కుటుంబ సభ్యులు ఆదివారం హసీన్ జహాన్ లాయర్ జకీర్ హుస్సేన్‌ను కలిసి మాట్లాడారు. కోర్టు వెలుపల సమస్యను పరిష్కరించుకుందామని తెలిపారు. ఈ విషయాన్ని ధ్రువీకరించిన హుస్సేన్ అంతకుమించి మాట్లాడేందుకు నిరాకరించారు. ఇరు కుటుంబాల మధ్య చర్చలు పురోగతిలో ఉన్నట్టు పేర్కొన్నారు.

హసీన్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. షమీ కుటుంబ సభ్యులు తమ లాయర్‌ను కలిసినట్టు పేర్కొన్న హసీన్ తనకైతే ఇప్పటి వరకు ఎటువంటి కాల్స్ రాలేదన్నారు. ‘‘అతడు కనుక నిజంగా మారాలనుకుంటే నేను నా కుటుంబాన్ని కాపాడుకోవడం గురించి కూడా సీరియస్‌గా ఆలోచిస్తా’’ అని హసీన్ పేర్కొన్నారు. షమీ కూడా ఇంచుమించు ఇలాగే స్పందించాడు. చర్చల ద్వారా సమస్య పరిష్కారమవుతుందనుకుంటే అంతకుమించి కావాల్సిందేమీ లేదని, తాను సిద్ధమని పేర్కొన్నాడు. సమస్యను పరిష్కరించుకోవడం తమకు, తన కెరీర్‌కు, తన కుమార్తె భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమని వివరించాడు.

కాగా, షమీ మోసగాడని, పలు దేశాల్లోని మహిళలతో అతడికి సంబంధాలున్నాయని, తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడంటూ హసీన్ కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఫిర్యాదుపై పోలీసులు పలు సెక్షన్ల కింద షమీపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.

More Telugu News