మీ స్పీడ్ చూస్తుంటే చాలా భయం వేస్తోంది: అభిమానులకు పవన్ కల్యాణ్ స్వీట్ వార్నింగ్!
- పవన్ కల్యాణ్ అనంతపురం పర్యటనలో అపశ్రుతులు
- వాటిని ప్రస్తావిస్తూ అభిమానులను హెచ్చరించిన జనసేనాని
- సమస్యలు తెలియాలంటే ప్రజల్లోకి రాక తప్పదన్న పవన్
ఈ ఉదయం ధర్మవరంలో మాట్లాడిన ఆయన, తాను సినిమా ఫంక్షన్స్ ఎక్కువగా జరుపుకోనని, అభిమానులు నలిగిపోవడం తనకు ఇష్టం లేకనే ఫంక్షన్స్ కు దూరంగా ఉంటానని చెప్పారు. కానీ, ప్రజా సమస్యలను గురించి తెలుసుకునేందుకు ప్రజల్లోకి రాక తప్పదని, దీనివల్ల అభిమానులు ఇబ్బందులకు గురి కావడం తనకు ఆందోళన కలిగిస్తోందని చెప్పారు.
కోట్ల మంది ప్రజల సమస్యలను ఇంట్లో కూర్చుంటే తెలుసుకోలేనని చెప్పిన పవన్ కల్యాణ్, తాను కూడా కొంత నలగాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అభిమానులు సాధ్యమైనన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను గుర్తు చేసుకోవాలని, వారి తరువాతే అభిమాన హీరో అనుకోవాలని హితవు పలికారు. వేగంగా, అత్యుత్సాహంతో రావద్దని, సంతోషంగా, నెమ్మదిగా రావాలని పిలుపునిచ్చారు. ఎవరికి ఏమైనా ఓ అన్నగా తనకు బాధ కలుగుతుందని, తనకు ఎటువంటి వేదనను కలిగించవద్దని వేడుకుంటున్నానని చెప్పారు.