Padmavat: 'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య: రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

  • చిత్తోర్ గఢ్ లో 'చేతావని ర్యాలీ'
  • జౌహార్ కు సిద్ధమని నినాదాలు
  • సినిమా ప్రదర్శిస్తే అగ్నిలో దూకుతామని హెచ్చరిక

'పద్మావత్' చిత్రాన్ని విడుదల చేస్తే, తామంతా ఆత్మహత్య చేసుకుంటామని 1,908 మంది రాజస్థానీ మహిళలు అల్టిమేటం ఇచ్చారు. చిత్తోర్ గఢ్ లో 'చేతావని ర్యాలీ' పేరిట నిరసన ప్రదర్శన నిర్వహించిన మహిళలు, తామంతా 'జౌహార్' (అగ్నిగుండంలో దూకి ప్రాణార్పణ చేయడం)కు సిద్ధమని స్పష్టం చేస్తూ, తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవడం కలకలం రేపుతోంది. వెంటనే ఉన్నతాధికారులు ఈ సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు.

చిత్తోర్ గఢ్ కోట నుంచి ప్రారంభమైన మహిళల ర్యాలీ, పట్టణ వీధుల్లో సాగింది. ఆపై వీరంతా కలసి జిల్లా కలెక్టర్ ఇంద్రజిత్ సింగ్ వద్దకు వెళ్లి, ఈ మేరకు మెమొరాండం సమర్పించారు. తమ డిమాండ్ ను ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకు వెళ్లాలని వారు కోరారు. వీరనారి రాణీ పద్మినిని అవమానించేలా సినిమాను తీశారని ఆరోపించిన వారు, ఈ సినిమాను ప్రదర్శించే థియేటర్ల వద్ద సోమవారం నుంచి మూడు రోజుల పాటు ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. కాగా, తాము 100 సినిమాహాల్స్ ను సంప్రదించామని, వారెవరూ ఈ సినిమాను ప్రదర్శించబోవడం లేదని లిఖిత పూర్వకంగా తెలిపారని శ్రీ రాజ్ పుత్ కర్ణిసేన ప్రతినిధి వీరేంద్ర సింగ్ తెలిపారు.

More Telugu News