teenage: టీనేజ్ నిర్వ‌చ‌నాన్ని మార్చాలంటూ శాస్త్ర‌వేత్త‌ల సిఫార‌సు!

  • 10 -25 ఏళ్ల వ‌య‌సును టీనేజ్‌గా ప‌రిగ‌ణించాల‌ని సూచ‌న‌
  • ప్ర‌స్తుత ఆరోగ్య‌, సామాజిక ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లుగా మార్పు
  • ఇప్ప‌టివ‌ర‌కు 13- 19 ఏళ్ల వ‌య‌సును టీనేజ్‌గా ప‌రిగ‌ణ‌న‌

హార్మోన్ల ఉత్ప‌త్తి కార‌ణంగా లైంగిక మార్పులు బ‌య‌ట‌ప‌డే టీనేజ్ నిర్వ‌చ‌నంలో మార్పులు చేయాల‌ని శాస్త్ర‌వేత్త‌లు సూచిస్తున్నారు. మారుతున్న ఆరోగ్య‌, సామాజిక ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లుగా టీనేజ్ నిర్వచ‌నంలో కూడా మార్పులు చేయాల‌ని వారు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇప్ప‌టివరకు 13-19 ఏళ్ల వ‌య‌సు మ‌ధ్య కాలాన్ని టీనేజ్‌గా చెబుతున్నారు. కానీ ఇక నుంచి 10-25 ఏళ్ల వ‌య‌సును కౌమార ద‌శగా ప‌రిగణిస్తే బాగుంటుంద‌ని వారు చెబుతున్నారు.

ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న‌ పౌష్టికాహారం లభ్యత, ఇతర కారణాల వల్ల పదో ఏటలోనే కౌమార‌ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇంగ్లండు వంటి పారిశ్రామిక దేశాల్లో గత 150 ఏళ్ల గణాంకాలను పరిశీలిస్తే బాలికల్లో 12-13 ఏళ్ల వయసులోనే రుతుక్రమం ప్రారంభమవుతోంది. అలాగే చాలా మంది జీవితంలో స్థిర‌ప‌డాల‌నే ఉద్దేశంతో 25 ఏళ్ల వయసు వచ్చే వరకు ఎవరూ పెళ్లి గురించి ఆలోచించ‌డం లేదు.

దీన్ని బ‌ట్టి చూస్తే యవ్వనం వచ్చిన‌ప్ప‌టికి వారు కౌమార ద‌శ‌లో ఉన్న‌ట్టుగా ఉంటున్నారు. ఈ కార‌ణాల వ‌ల్ల 10-25 సంవత్సరాల మధ్యనున్న కాలాన్ని కౌమార దశగా పరిగణిస్తే బాగుంటుందని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివ‌ర‌ణ‌ల‌తో లాన్సెట్‌ ఛైల్డ్‌ అండ్‌ అడోల్‌సెంట్‌ హెల్త్‌ జర్నల్‌లో ఓ వ్యాసం ప్రచురితమయింది.

More Telugu News