Cricket: క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హెల్మెట్ పెట్టుకుని బౌలింగ్ వేసిన కివీస్ బౌలర్!

షార్ట్స్‌లో చూడండి
క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్, కీపర్, స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్నవారు హెల్మెట్  పెట్టుకోవడం చాలా మామూలు విషయం. అయితే న్యూజిలాండ్ సీమర్ వారెన్ బార్నెస్ ఈ సంప్రదాయాన్ని సమూలంగా మార్చేశాడు. బౌలింగ్ వేస్తున్న సమయంలో హెల్మెట్ ధరించి క్రికెట్ చరిత్రలోనే తొలి బౌలర్‌గా అవతరించాడు. హమిల్టన్‌ వేదికగా ఒటాగో-నార్తరన్ నైట్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది.

నార్తరన్ నైట్స్ ఫాస్ట్ బౌలర్ నీల్ వాగ్నర్‌ కాలుకు బ్యాట్స్‌మన్ కొట్టిన బంతి నేరుగా వచ్చి తాకింది. ఆ బంతి తలకి తాకి ఉంటే ఇంకేమైనా ఉందా? అని భావించిన వారెన్ తాను బౌలింగ్ వేస్తున్నప్పుడు బేస్‌బాల్ అంపైర్ ధరించే హెల్మెట్‌ను పెట్టుకుని మరీ బౌలింగ్ వేశాడు. మ్యాచ్ అనంతరం తాను హెల్మెట్ ధరించడాన్ని వారెన్ సమర్థించుకున్నాడు. బౌలింగ్ చేసేటప్పుడు తన తల నేరుగా బ్యాట్స్‌మెన్‌ వైపే ఉంటుందని, కాబట్టి బ్యాట్స్‌మెన్ కొట్టే బంతి తలకు తాకే అవకాశం ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు. కాగా, ఈ మ్యాచ్‌లో వారెన్ హెల్మెట్ పెట్టుకుని మూడు ఓవర్లు వేశాడు.

ఆటగాళ్లు మైదానంలో బంతి తగిలి గాయాలపాలవకుండా ఉండాలనే ఉద్దేశంతో 1970 చివరిలో హెల్మెట్లు ప్రవేశించాయి. తొలుత వీటిని ఉపయోగించేందుకు ఆటగాళ్లు అంతగా ఆసక్తి చూపకపోయినా క్రమంగా హెల్మెట్ల వాడకం ఎక్కువైంది. బ్యాట్స్‌మెన్, కీపర్, కొన్ని సమయాల్లో ఫీల్డర్లు వాడుతున్నారు. అయితే ఇప్పుడు బౌలర్ కూడా ధరించడంతో ఇది పెద్ద వార్తయింది.
Go Back to Shorts
Cricket
Bowler
Helmet
Warren Barnes
New Zealand

More Telugu News