సిద్దిపేట జిల్లాలో విషాదం.. ఆర్థిక ఇబ్బందులకు తాళలేక రైతు కుటుంబం ఆత్మహత్య
Add ap7am to your home Screen

సిద్దిపేట జిల్లాలో విషాదం.. ఆర్థిక ఇబ్బందులకు తాళలేక రైతు కుటుంబం ఆత్మహత్య

  • తండ్రి, కుమారుడు, కుమార్తె మృతి
  • ఉసురు తీసిన అప్పులు
  • కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న తల్లి
  • శోకసంద్రంలో గ్రామం
సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని తురకవానికుంటలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధకు తాళలేని ఓ రైతు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తండ్రి, కుమారుడు, కుమార్తె చనిపోగా, తల్లి ప్రాణాపాయస్థితిలో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతోంది. మంగళవారం ఉదయం వెలుగుచూసిన ఈ ఘటనతో గ్రామం విషాదంలో మునిగిపోయింది.

పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గుండా భగవాన్‌రెడ్డి (49), రాజవ్వ భార్యాభర్తలు, వీరికి ప్రేమ్‌చందర్‌ రెడ్డి (25) అనే కుమారుడు, రోజా (22) అనే కుమార్తె ఉన్నారు. ఎంబీఏ చేసిన ప్రేమ్ చందర్ హైదరాబాద్‌లో ఉద్యోగాన్వేషణలో ఉండగా, ఎంబీఏ పూర్తి చేసిన రోజా ఇంటి వద్దే ఉంటోంది. వీరికి ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, అందులో మొక్కజొన్న, కూరగాయలు సాగుచేస్తూ జీవనం సాగిస్తున్నారు. భగవాన్‌రెడ్డి కుటుంబానికి రూ.5 లక్షల వరకు అప్పులు ఉన్నాయి.

హైదరాబాద్‌లో ఉంటున్న ప్రేమ్ చందర్ సోమవారం ఇంటికి రాగా అందరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. భార్య, కుమారుడు, కుమార్తెలకు పురుగు మందు తాగించిన భగవాన్ రెడ్డి ఆయన మాత్రం ఉరి వేసుకున్నాడు. మంగళవారం ఉదయం బారెడు పొద్దెక్కినా వారింటి నుంచి చడీచప్పుడు లేకపోవడంతో అనుమానం వచ్చిన ఇరుగుపొరుగువారు తలుపు తీసి చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

భగవాన్‌రెడ్డి, ప్రేమ్ చందర్‌రెడ్డి, రోజాలు విగత జీవులుగా కనిపించగా, కొన ప్రాణంతో ఉన్న రాజవ్వను వెంటనే కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. భగవాన్ రెడ్డి జేబులో సూసైడ్ నోట్ లభించినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
Telangana
sidhipet
Farmer

More Telugu News