Prabhas: ప్రభాస్ తో కలసి పర్సనలైజ్డ్ థియేటర్ల వ్యాపారంలోకి రాం చరణ్!

  • ఓ కుటుంబం కలిసి సినిమాను చూసేలా థియేటర్లు
  • కేవలం 10 అడుగుల వెడల్పులో థియేటర్
  • అన్ని పట్టణాల్లో ప్రారంభించే ఆలోచన
  • వెలువడాల్సిన అధికారిక సమాచారం!

ఇప్పటికే మిత్రులతో యూవీ క్రియేషన్స్ బ్యానర్ ను ఏర్పాటు చేసి మిర్చి, రన్ రాజా రన్ వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన హీరో ప్రభాస్, ట్రూ జెట్ లో భాగస్వామ్యంతో వ్యాపారంలోకి ప్రవేశించిన మెగా హీరో రాంచరణ్ తో కలసి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై అధికారిక సమాచారం లేకున్నా, ఇద్దరూ కలిసి థియేటర్ బిజినెస్ ప్రారంభించనున్నారని, ఇందుకు పెట్టుబడి కూడా సిద్ధమైందని సమాచారం.

పర్సనలైజ్డ్ మూవీ థియేటర్స్ ను ప్రతి పట్టణంలోనూ ప్రారంభించాలన్నది వీరి ఆలోచన. ఈ సినిమా థియేటర్స్ లో 70 నుంచి 100 అంగుళాల తెరలు, పూర్తి అత్యాధునిక సౌకర్యం, సౌండ్ సిస్టమ్ తో ఉంటాయని, ఇద్దరి నుంచి 10 లేదా 12 మంది వరకూ ఒకేసారి కలిసి కూర్చుని సినిమాను వీక్షించేలా ఇవి ఉంటాయని తెలుస్తోంది. 8 నుంచి 10 అడుగుల వెడల్పు, 10 నుంచి 12 అడుగుల పొడవుతో ఉండే మినీ థియేటర్స్ ను ఏర్పాటు చేయాలన్నది వీరిరువురూ కలసి ఆలోచిస్తున్నారని, అందుకు అటు కృష్ణంరాజు నుంచి, ఇటు చిరంజీవి నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

ఓ కుటుంబమంతా కలసి సినిమాను థియేటర్ లో చూసిన అనుభూతిని పొందుతూ ఇక్కడ వీక్షించవచ్చని ఈ డీల్ గురించి తెలిసిన వ్యక్తుల సమాచారం. ఇప్పటికే ప్రభాస్, రాంచరణ్ మధ్య పర్సనల్, ప్రొఫెషనల్ స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరి వ్యాపార భాగస్వామ్యంపై పూర్తి సమాచారం వెలువడాల్సివుంది.

More Telugu News