పవన్ ఘాటు విమర్శలకు వైసీపీ నుంచి కౌంటర్ లేనిది అందుకేనా?
- పవన్ విమర్శలకు వైసీపీ నుంచి స్పందన కరువు
- పార్టీలో లేని క్లారిటీ.. పీకే సలహా కూడా ఓ కారణం
- జనసేనపై తమ విధానమేంటో తెలియక అయోమయంలో నేతలు
పవన్ టీడీపీపై చేసిన విమర్శలకు ఆ పార్టీ నేతలు స్పందించగా, తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడారు. పవన్ విమర్శలను తిప్పి కొట్టారు. ఏదైనా మాట్లాడేముందు ఆ విషయం గురించి అవగాహన పెంచుకోవాలని చురకలు వేశారు. బీజేపీ నేతలు కూడా పవన్‌కు కౌంటర్ ఇచ్చారు. అయితే ప్రతిపక్ష వైసీపీ నుంచి మాత్రం స్పందన కరువైంది. దీంతో జనసేనపై వైసీపీ విధానమేంటో తెలియక ఆ పార్టీ నేతలే తలలు పట్టుకుంటున్నారు.
నిజానికి పవన్ విమర్శలపై స్పందించడానికి వైసీపీ నేతలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. సాధారణంగా చీటికి మాటికి మీడియా ముందుకు వచ్చే సీనియర్లు సైతం పవన్ విషయంలో మౌనం దాల్చారు. పవన్‌పై ఎలా రియాక్ట్ కావాలన్న విషయంలో పార్టీలో గందరగోళం నెలకొందని చెబుతున్నారు. పవన్‌పై అతిగా స్పందిస్తే ఎటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్న దానిపై పార్టీలో క్లారిటీ కరువైంది. ఒకవేళ పవన్‌పై విరుచుకుపడితే ఆయన స్పందిస్తారు. ఫలితంగా వైసీపీ-జనసేన మధ్య అది వార్‌గా మారుతుంది.
అదే జరిగితే ఇప్పటికే ప్రతిపక్షంగా విలఫమైనట్టు ఆరోపణలున్న వైసీపీకి అది పెనునష్టం కలిగించే అవకాశం ఉంది. దీనికి తోడు పవన్ విషయంలో కొంత సంయమనం పాటించాలన్న ‘పీకే’ సలహా కూడా కొంత కారణమని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపును సొంతం చేసుకోవాలంటే జనసేన మద్దతు ఎంతో అవసరమని పీకే సలహా ఇచ్చారని సమాచారం. ఇటీవల జగన్ తన సొంత చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ గురించి మాట్లాడుతూ ప్రభుత్వంపై పోరాడేందుకు జనసేన వస్తే కలిసి పనిచేస్తామని చెప్పడానికి అదే కారణమని అంటున్నారు.