Hyderabad: పండుగ ప్రయాణికులకు చేదువార్త.. రిజర్వేషన్లు ఫుల్.. కానరాని ప్రత్యేక రైళ్లు!

  • ఏపీ వెళ్లే రైళ్లలో నిండుకున్న రిజర్వేషన్లు
  • దిక్కుతోచని స్థితిలో ప్రయాణికులు
  • ఇదే అదునుగా దండుకుంటున్న ప్రైవేటు ఆపరేటర్లు

సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారికి ఇది చేదువార్తే. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్, ఆ రాష్ట్రం మీదుగా సాగే రైళ్లలో రిజర్వేషన్లు ఇప్పటికే నిండుకున్నాయి. ఇప్పుడు మిగిలింది ‘తత్కాల్’ ఆశ ఒక్కటే. రైళ్లతోపాటు ప్రైవేటు, ఆర్టీసీ బస్సుల్లోనూ టికెట్లు ఇప్పటికే రిజర్వు కావడంతో పండుగ ప్రయాణం భారంగా మారనుంది. నెల రోజుల ముందుగానే రిజర్వేషన్లు అయిపోవడంతో ప్రయాణికులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

నాలుగు నెలల ముందు నుంచే టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు ఉండడంతో ప్రయాణికులు తొందరపడ్డారు. చివరి నిమిషంలో హైరానాను తప్పించుకునేందుకు ముందే రిజర్వ్ చేసి పెట్టుకోవడంతో అప్పటికప్పుడు ఊర్లకు వెళ్లాలనుకున్న వారికి ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు.

నరసాపురం నుంచి బయలుదేరే నరసాపూర్, తిరుపతి, నాగర్‌సోల్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో ఏసీ నుంచి సెకెండ్ క్లాస్ వరకు ఒక్క టికెట్ కూడా మిగలకుండా బుక్ అయ్యాయి. ఇక నరసాపురం వైపు వెళ్లే రైళ్లలో వచ్చే నెల 20వరకు వెయిటింగ్ లిస్టే దర్శనమిస్తోంది. అక్కడి నుంచి బయలుదేరే రైళ్లలో జనవరి 25 వరకు వెయిటింగ్ లిస్ట్ ఉంది.

రిజర్వేషన్లు ఫుల్ కావడంతో తత్కాల్ ద్వారా సొంత గ్రామాలకు చేరుకోవాలని భావిస్తున్నవారు అధిక వడ్డనకు సిద్ధం కావాల్సి ఉంటుంది. టూటైర్ ఏసీపై రూ.400, త్రీటైర్ ఏసీపై రూ.300, స్లీపర్ క్లాస్‌లో అయితే దూరాన్ని బట్టి రూ.175 వరకు అదనపు భారం భరించాల్సి ఉంటుంది.
 
పండుగ రద్దీని క్యాష్ చేసుకునేందుకు ప్రైవేటు ఆపరేటర్లు ఇప్పటి నుంచి సిద్ధమయ్యారు. అసలు చార్జీలను దాదాపు రెట్టింపు చేసి టికెట్లను విక్రయిస్తున్నారు. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి నరసాపూర్‌కు ఏసీ టికెట్ ధర రూ.700 వసూలు చేస్తుండగా పండుగ రోజుల్లో అది ఏకంగా రూ.1500కు చేరుకుంటోంది.

సాధారణంగా పండుగ సమయాల్లో ప్రత్యేక రైళ్లను వేసే రైల్వే ఈసారి ఒకటి రెండు రైళ్లతో సరిపుచ్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేసిన ఒకటి రెండు ప్రత్యేక రైళ్లు ఏలూరు, తాడేపల్లిగూడెం మీదుగా వెళ్తుండడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నగరం నుంచి ఎక్కువగా ప్రయాణికులు వెళ్లే భీమవరం, నరసాపురం రూట్లో ఒక్క రైలు కూడా వేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

More Telugu News