google search: గూగుల్ సెర్చ్‌లో కొత్త ఫీచ‌ర్‌... సెల్ఫీ వీడియోల‌తో స‌మాధానాలు చెబుతున్న‌ సెలెబ్రిటీలు!

  • త‌మ గురించిన ప్ర‌శ్న‌ల‌కు స్వ‌యంగా సెలెబ్రిటీలే స‌మాధానం
  • ప్రియాంక చోప్రా, మార్క్ వాల్‌బ‌ర్గ్ వంటి వారితో ప్రారంభం
  • త్వ‌ర‌లో మ‌రింత మంది సెలెబ్రిటీల‌ వీడియోలు

సెలెబ్రిటీల‌కు సంబంధించిన కొన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం కోసం నెటిజ‌న్లు గూగుల్‌ని ఆశ్ర‌యిస్తుంటారు. ఒక్కో వెబ్‌సైట్‌లో ఒక్కో స‌మాధానం ఉండ‌టంతో స‌రైన స‌మాధానం ఏంటో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతుంటారు. ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారాన్ని చెప్ప‌డానికి సెర్చింజ‌న్‌లో ఓ కొత్త ఫీచ‌ర్‌ను గూగుల్ ప్ర‌వేశ‌పెట్టింది.

స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ఓపెన్ చేసి, ఎవ‌రైనా సెల‌బ్రిటీ గురించి ప్ర‌శ్న‌లు అడిగితే వారే స్వ‌యంగా సెల్ఫీ వీడియోల ద్వారా స‌మాధానం చెబుతారు. నిన్న‌నే ప్రారంభ‌మైన ఈ ఫీచ‌ర్‌లో ప్ర‌స్తుతం ప్రియాంక చోప్రా, నిక్ జోన‌స్‌, మార్క్ వాల్‌బ‌ర్గ్‌, జేమ్స్ ఫ్రాంకో, జినా రోడ్రిగేజ్ వంటి సెల‌బ్రిటీల సెల్ఫీ వీడియోల స‌మాధానాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో మ‌రింత మంది సెలెబ్రిటీల వీడియోల‌ను జోడించ‌నున్న‌ట్లు గూగుల్ వెల్ల‌డించింది. ఈ ఫీచ‌ర్‌ను ప‌రీక్షించాలంటే `How many languages does Priyanka Chopra speak?` అని స్మార్ట్‌ఫోన్ గూగుల్ సెర్చ్ బార్‌లో కొట్టి చూడండి.

More Telugu News