madya pradesh: మధ్యప్ర‌దేశ్‌లో బాలిక‌ల‌పై అత్యాచారాల‌కు పాల్ప‌డే వారికి ఉరిశిక్ష.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం!

  • బిల్లుకి ఆమోదం తెలిపిన శాస‌న‌స‌భ‌
  • బాలిక‌ల‌పై అఘాయిత్యాలు పెరిగిపోతుండ‌డంతో క‌ఠిన నిర్ణ‌యం
  • కేంద్ర స‌ర్కారు, రాష్ట్ర‌ప‌తి ఆమోద‌మే త‌రువాయి

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బాలిక‌ల‌పై అఘాయిత్యాలు పెరిగిపోతోన్న విష‌యం తెలిసిందే. గత నెల కోచింగ్‌ సెంటర్‌ నుంచి ఇంటికి వెళ్తున్న బాలికపై కొందరు అత్యాచారానికి పాల్పడడం ఆ రాష్ట్రంలో అగ్గి రాజేసింది. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల ఆ రాష్ట్ర మంత్రి మండ‌లి కొత్త చ‌ట్టాన్ని తీసుకురావాల‌ని నిర్ణ‌యించుకుంది. ఈ రోజు ఆ బిల్లును మ‌ధ్యప్ర‌దేశ్ అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టారు. దీని ప్ర‌కారం పన్నెండేళ్లు, అంతకంటే తక్కువ వయసున్న బాలికలపై అత్యాచారానికి పాల్పడితే ఉరి శిక్ష విధిస్తారు. అంతేకాదు, బాలికలపై వేధింపులకు పాల్పడితే జైలు శిక్ష మరింత కఠినంగా ఉండ‌నుంది.
 
బాలిక‌ల‌పై అత్యాచారాలకు పాల్పడే వారు మనుషులు కారని ఈ సంద‌ర్భంగా మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్ అన్నారు. వేధింపులకు పాల్పడే వారిపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేస్తామ‌ని తెలిపారు. మధ్యప్రదేశ్‌ శాసనసభ ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. అయితే, ఈ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయాల్సి ఉంది.

More Telugu News