YSRCP: జగన్ పాదయాత్రకు రెండో బ్రేక్.. హైదరాబాదు చేరిన వైకాపా అధినేత!

  • కర్నూలు జిల్లాలో సాగుతున్న యాత్ర
  • నేడు కోర్టులో హియరింగ్ ఉండటంతో హైదరాబాద్ కు
  • తిరిగి రాత్రికి దొర్నిపాడుకు వెళ్లనున్న జగన్

వైకాపా అధినేత వైఎస్ జగన్ పాదయాత్రకు రెండో బ్రేక్ పడింది. గురువారం నాడు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలోని పెద్ద చింతకుంట, భాగ్యనగరం, రామచంద్రాపురం క్రాస్, కొండాపురం గ్రామాల మీదుగా సాగిన తన ప్రజా సంకల్పయాత్రకు దొర్నిపాడు వద్ద విరామం ఇచ్చిన జగన్, రాత్రి హైదరాబాద్ కు బయలుదేరి వచ్చారు. నేడు నాంపల్లి సీబీఐ కోర్టులో అక్రమాస్తుల కేసు విచారణలో ఉండటంతో అందుకు హాజరయ్యేందుకు జగన్ ప్రతి వారం పాదయాత్రకు బ్రేక్ ఇస్తున్న సంగతి తెలిసిందే.

గత వారం కూడా ఆయన కడప జిల్లాలో యాత్రకు తాత్కాలిక విరామం పలికి కోర్టుకు హాజరయ్యారు. ఇక తన 10వ రోజు యాత్రలో భాగంగా 13.2 కి.మీ. నడిచిన జగన్, ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. పెద్ద చింతకుంట వద్ద తనను కలిసిన ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఓ బాలసదనంలోని చిన్నారులు తన కోసం రోడ్డుపైకి వచ్చి వేచి చూస్తుండటాన్ని గమనించిన జగన్, వారిని ఆప్యాయంగా పలకరించి ఫొటోలు దిగారు. పలువురు మహిళలు, వృద్ధులు, వ్యవసాయ కూలీలు జగన్ ను కలిసి తమ సాదక బాధకాలు చెప్పుకున్నారు. నేడు కోర్టుకు హాజరైన అనంతరం రాత్రికి తిరిగి దొర్నిపాడుకు వెళ్లనున్న జగన్, రేపు ఉదయం తిరిగి పాదయాత్రను ప్రారంభించనున్నారు.

More Telugu News