kamal haasan: కమలహాసన్ మానసిక స్థితి బాగోలేదు.. ఆస్పత్రిలో చేర్పించాలి: బీజేపీ

  • హిందూ ఉగ్రవాదం పెరిగిందన్న కమల్
  • ఆధారాలు లేకుండానే విమర్శలు చేస్తున్నారన్న బీజేపీ
  • పరువు నష్టం దావాను పరిశీలిస్తున్న తమిళనాడు బీజేపీ

మన దేశంలో హిందూ ఉగ్రవాదం ఉందంటూ వ్యాఖ్యానించిన ప్రముఖ నటుడు కమలహాసన్ పై బీజేపీ మండిపడింది. హిందూ ఉగ్రవాదం అన్న పదం వాడినందుకు ముందు ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. కమల్ మానసిక ఆరోగ్యం బాగోలేదని... వెంటనే ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందించాలని బీజేపీ సీనియర్ నేత వినయ్ కటియార్ అన్నారు. రాజకీయాలు ఇంత దారుణంగా దిగజారడం మంచిది కాదని చెప్పారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే కమల్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కమల్ పై పరువునష్టం దావా అంశాన్ని కూడా తమిళనాడు బీజేపీ పరిశీలిస్తోందని చెప్పారు.


వివాదం వివరాల్లోకి వెళ్తే, దేశంలో హిందూ ఉగ్రవాదం పెరిగిపోయిందని కమల్ ఆరోపించారు. ఈ ఉగ్రవాదాన్ని అడ్డుకోవడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. గుజరాత్, యూపీ, రాజస్థాన్ లలో పరిస్థితి మరింత దారుణంగా ఉందని చెప్పారు. ఈ మేరకు వికటన్ పత్రికలో ఆయన రాసిన వ్యాసం దుమారం రేపుతోంది.

హిందూ సంస్థలు గతంలో హింసకు పాల్పడేవి కాదని, మాటలతోనే ప్రత్యర్థులను ఎదుర్కొనేవని, ఇప్పుడు మాత్రం భౌతిక దాడులకు కూడా తెగబడుతున్నాయని కమల్ తన కథనంలో పేర్కొన్నారు. హిందూ ఉగ్రవాదులను కొందరు వెనుక నుంచి ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాట వేడి పుట్టిస్తున్నాయి.

More Telugu News