Terror: విమానంలో అతి భయానక అనుభవాన్ని ఎదుర్కున్న ప్రయాణికులు!

  • ఆస్ట్రేలియాలోని పెర్త్‌ నుంచి ఇండోనేషియాకు బ‌య‌లుదేరిన‌ విమానం
  • ఆకాశంలో 32,000 అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా 10,000 అడుగుల‌కు దిగిపోయిన వైనం 
  • సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే జరిగిందన్న ఎయిర్‌ ఏసియా
  • ఆక్సిజన్ మాస్కులు పెట్టుకుని భయంతో వణికిపోయిన ప్రయాణికులు 

ఆస్ట్రేలియాలోని పెర్త్‌ నుంచి ఇండోనేషియాకు బ‌య‌లుదేరిన‌ ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ ఏసియాకు చెందిన విమానంలో ప్రయాణిస్తోన్న వారికి అతి భయానక అనుభవం ఎదురైంది. ఆకాశంలో 32,000 అడుగుల ఎత్తులో ఉన్న ఆ విమానంలో సాంకేతిక స‌మ‌స్య త‌లెత్త‌డంతో ఒక్క‌సారిగా అది 10,000 అడుగుల‌కు దిగిపోయింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను తాజాగా ఆ విమానయాన సంస్థ అధికారులు విడుద‌ల చేశారు.

ఈ ఘ‌ట‌నతో ఎయిర్ ఏసియా స్టాఫ్ విమానంలో హెచ్చ‌రిక గంట మోగించి, ఆక్సిజ‌న్ మాస్కులు పెట్టుకోవాల్సిందిగా ప్ర‌యాణికుల‌కు సూచించారు. తీవ్ర ఆందోళ‌న‌కు గురైన‌ ప్ర‌యాణికులంతా వెంట‌నే ఆక్సిజ‌న్ మాస్క్‌లు పెట్టుకున్నారు. స‌ద‌రు విమానం 10,000 అడుగుల ఎత్తుకి చేరుకున్న అనంత‌రం మ‌ళ్లీ కంట్రోల్‌లోకి వ‌చ్చింది. ఆ విమానాన్ని పైల‌ట్‌ వెంట‌నే మ‌ళ్లీ ఆస్ట్రేలియాలోని పెర్త్ విమానాశ్ర‌యంలోనే దించేశారు. ఆందోళ‌న‌కు గురైన ప్ర‌యాణికులు ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకోవ‌డంతో విమానం నుంచి దిగుతూ, క‌న్నీరు పెట్టుకుంటూ త‌మ భయానక అనుభ‌వాల్ని పంచుకున్నారు.

విమానంలో ఉన్న‌ త‌మ‌కు ఏం జ‌రుగుతోందో అస్సలు అర్థం కాలేద‌ని ఒక ప్ర‌యాణికురాలు చెప్పారు. వెంట‌నే త‌న ఫోన్ తీసుకుని త‌న కుటుంబ స‌భ్యుల‌కు మెసేజ్ పెట్టాన‌ని మ‌రో ప్ర‌యాణికురాలు తెలిపింది. ఈ ఘ‌ట‌న సాంకేతిక స‌మ‌స్య వ‌ల్లే త‌లెత్తింద‌ని తెలిపిన ఎయిర్ ఏసియా ప్ర‌యాణికుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెబుతున్న‌ట్లు పేర్కొంది. ప్రయాణికుల సంక్షేమ‌మే త‌మ ల‌క్ష్యం అన్న త‌మ నినాదానికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని తెలిపింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని పేర్కొంది.

More Telugu News