rose mcgowen: హాలీవుడ్ న‌టి అకౌంట్‌ను బ్లాక్‌ చేసిన ట్విట్ట‌ర్‌... బాయ్‌కాట్ చేస్తున్న మ‌హిళా నెటిజ‌న్లు

  • నిర్మాత హార్వీ గురించి ట్వీట్ చేసిన రోస్ మెక్‌గోవెన్‌
  • ఆమె ట్వీట్‌ను బ్లాక్ చేసిన ట్విట్ట‌ర్‌
  • త‌మ పాల‌సీకి వ్య‌తిరేకంగా ఉంద‌ని వ్యాఖ్య‌

గ‌త రెండ్రోజులుగా హాలీవుడ్‌ నిర్మాత హార్వీ వీన్‌స్టెయిన్ లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌ల అంశం సంచ‌ల‌నం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. హార్వీ త‌మ‌ను లైంగికంగా వేధించాడ‌ని ప్ర‌ముఖ హీరోయిన్లు ఆరోపిస్తున్న నేప‌థ్యంలో మ‌రో న‌టి రోస్ మెక్‌గోవెన్ కూడా ఈ విష‌యం గురించి ట్వీట్ చేసింది. గ‌తంలో త‌న‌ను ఓ స్టూడియో అధినేత రేప్ చేశాడ‌ని బ‌హిరంగంగా ప్ర‌క‌టించిన రోస్... గురువారం ట్విట్ట‌ర్ సంస్థ‌ త‌న అకౌంట్‌ను బ్లాక్ చేసింద‌ని ఇన్‌స్టాగ్రాంలో పేర్కొంది. ఆ త‌ర్వాత `హెచ్‌డ‌బ్ల్యూ (హార్వీ వీన్ స్టీన్) నన్ను రేప్ చేశాడు` అంటూ వ్యాఖ్యానించింది. 1997లో స‌న్‌డ్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ స‌మ‌యంలో ఓ హోట‌ల్ రూంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌కు గాను హార్వీ, రోస్‌కి 1 మిలియ‌న్ డాల‌ర్లు చెల్లించిన‌ట్లు తెలుస్తోంది.

అయితే రోస్ అకౌంట్‌ను బ్లాక్ చేయ‌డంపై మ‌హిళా నెటిజ‌న్లు మండిప‌డ్డారు. వారంతా శుక్ర‌వారం రోజున సామూహిక బాయ్‌కాట్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. `#WomenBoycottTwitter` పేరుతో త‌మ ట్విట్ట‌ర్ ఖాతాను ఒక‌రోజు పాటు నిలిపివేయాల‌ని ప్ర‌చారం చేస్తున్నారు. ప్ర‌చారం విప‌రీతంగా పెరిగిపోవ‌డంతో గురువారం మ‌ధ్యాహ్నానికి రోస్ ఖాతాను ట్విట్టర్ పున‌రుద్ధరించింది.

తర్వాత రోస్ అకౌంట్‌ను నిషేధించ‌డం వెన‌క కార‌ణాల‌ను కూడా వెల్ల‌డించింది. రోస్ త‌న ట్వీట్‌లో ఒక వ్య‌క్తిగ‌త ఫోన్ నెంబ‌ర్‌ను పేర్కొన్న‌ద‌ని, కంపెనీ పాలసీ ప్ర‌కారం అది త‌ప్ప‌ని, అందుకే ఆమె అకౌంట్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేసిన‌ట్లు పేర్కొంది. ప్ర‌స్తుతం ఆ ట్వీట్‌ను డిలీట్ చేసి, ఆమె అకౌంట్‌ను పునరుద్ధ‌రించామ‌ని పేర్కొంది. అయిన‌ప్ప‌టికీ మ‌హిళా బాయ్‌కాట్ ప్ర‌చారం ఇంకా కొన‌సాగుతూనే ఉండ‌టం గ‌మ‌నార్హం.

More Telugu News