Dubai: దుబాయ్ లో ఇదోతరహా మోసం.. పనిమనిషిని కంపెనీ యజమానిని చేసేశారు!

  • 2015లో దుబాయ్ వెళ్లిన ముంబైకి చెందిన ప్రతిభా ప్రకాశ్ రావు
  • 1025 దిర్హామ్స్ కి పని చేసిన ప్రతిభ
  • తన పాస్ పోర్ట్ వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో కంపెనీ యజమానురాలిగా తన పేరుందని తెలుసుకున్న ప్రతిభ
  • తన వీసా ఇచ్చేస్తే వెళ్లిపోతానన్న ప్రతిభ

సాధారణంగా గల్ప్ దేశాల్లో యజమానులు చిత్రహింసలు పెడుతున్నారని, రక్షించాలని వేడుకునే వార్తలు చదువుతుంటాం. కానీ పనికోసం వెళ్లిన మహిళను సంస్థ యజమానురాలిగా చేసి పాస్ పోర్ట్ ఇవ్వకుండా వేధిస్తున్న ఘటన దుబాయ్ లో చోటు చేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే... ముంబైకి చెందిన ప్రతిభా ప్రకాశ్‌ రావు (55) అనే మహిళ ఆర్థిక సమస్యల నేపథ్యంలో ఉపాధి నిమిత్తం 2015లో దుబాయికి వెళ్లింది. వర్క్ వీసా ఇప్పిస్తున్నానని చెప్పిన ఏజెంట్ మూడు నెలల విజిట్ వీసా ఇచ్చి ఆమెను మోసం చేశాడు. ఏజెంట్ సూచనతో ఆమెను ఒక వ్యక్తి పనిలోకి తీసుకున్నాడు. అనంతరం మూడు ఇళ్లు మార్చారు. చివరకు ఒక దుబాయ్ షేక్ నెలకు 1025 దిర్హమ్స్ (దాదాపు 18వేల రూపాయలు) జీతంతో ఆమెను పనిలోకి తీసుకున్నాడు.

అతని ఇద్దరు పిల్లల ఆలనా పాలనా చూసుకోవడమే ఆమె పని. ఆమె పనిలో చేరిన పదినెలలకే యజమాని దంపతులు విభేదాలతో విడిపోయారు. దీంతో ఆమె మరోసారి నిరుద్యోగిగా మారింది. దీంతో తన పాస్ పోర్ట్ ఇస్తే స్వదేశం వెళ్లిపోతానని ఆమె అతనిని కోరింది. అయితే ఆమె పాస్ పోర్ట్ తన దగ్గర లేదని, ఆమెను పంపిన ఏజెంట్ పనిచేసే కంపెనీ యజమాని దగ్గర అది వుందని చెప్పి, అక్కడికి వెళ్లమని ఆమెకు అడ్రస్ రాసి ఇచ్చాడు.

దీంతో ఆమె ఆ అడ్రస్ కు వెళ్లింది. అక్కడ రిసెప్షన్ లో తన పేరు ప్రతిభా ప్రకాశ్ అని చెప్పి, వీకే అనే వ్యక్తిని కలవాలని చెప్పింది. దీంతో రిసెప్షనిస్టు బిత్తరపోయింది. దీంతో విషయం తెలుసుకున్న ఆమె తన పేరుతో కంపెనీ నడుపుతున్నారని తెలుసుకుంది. కాసేపటికి వీకేను కలిసి తన పాస్ పోర్ట్ ఇప్పిస్తే దేశం వదిలి వెళ్లిపోతానని చెప్పింది. దీంతో పాస్ పోర్టు ఇచ్చేందుకు నిరాకరించిన అతను, కంపెనీలో పని చేస్తే జీతం ఇస్తానని నమ్మబలికాడు. అతని ప్రియురాలు కూడా రంగంలోకి దిగి నమ్మబలికింది.

 దీంతో వారికి సంబంధించిన వేరే కంపెనీలో ఆమెను పనికి పెట్టారు. 2019 జనవరి వరకు గడువు ఉండేలా మూడేళ్ల ఇన్వెస్టర్ వీసాను 2016 జనవరి 26న ఆమె పేరిట రప్పించారు. అయితే, కాలం గడుస్తున్నా వీసా ఇవ్వకపోవడంతో ఆగ్రహానికి గురైన ఆమె, నేరుగా పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లి తనకు జరిగిన మోసాన్ని చెప్పి న్యాయం చెయ్యాలని కోరింది. తన తండ్రి కంటి చూపు సరిగా లేదని, ఆయనకు ఆపరేషన్ చేయించేందుకు భారత్ వెళ్లాలని, కుటుంబ అప్పులు తీర్చేందుకు దుబాయ్ లో ఇంతకాలం ఉన్నానని ఆమె తెలిపింది.

దీంతో ఆమె పేరు కంపెనీ యజమానురాలి లిస్టులో ఉండడంపై పోలీసులు ఆరాతీశారు. దీంతో వీకే.. ఆమెను పది నెలల నుంచి వెతుకుతున్నానని పోలీసులకు తెలిపాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ప్రతిభ దుబాయ్ లోని భారతీయ ఎంబసీలో ఉండి న్యాయం కోసం, పాస్ పోర్ట్ కోసం పోరాడుతోంది. 

More Telugu News