jupudi prabhakar: ప్యాంటు, చొక్కా వేసుకొస్తే చాలు.. పార్లమెంటు వరకు తీసుకెళ్తామని రేవంత్ చెప్పారు: జూపూడి ప్రభాకర్

  • టీడీపీలో చేరాలన్న ఆలోచన మొదట్లో లేదు
  • చంద్రబాబును కలవడానికి మూడు నెలల సమయం తీసుకున్నా
  • పార్లమెంటుకు పంపిస్తామని రేవంత్ చెప్పారు
  • వైసీపీలో నచ్చకే బయటకు వచ్చా

వైసీపీ ఎక్కువ కాలం కొనసాగలేదనే విషయాన్ని అందరికంటే తానే ముందు పసిగట్టానని టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు అన్నారు. టీడీపీలో చేరాలనే ఆలోచన మొదట్లో తనకు లేదని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో చేరాలంటూ తనకు యనమల రామకృష్ణుడి నుంచి ఎప్పుడో పిలుపు వచ్చిందని... కానీ, సిద్ధాంతాల పరంగా వైరుధ్యం ఉండటంతో, తాను వెంటనే టీడీపీలోకి వెళ్లలేకపోయానని చెప్పారు. 'ఒకసారి వచ్చి ముఖ్యమంత్రిని కలువు' అంటూ యనమల పిలిచినా... సీఎంను కలవడానికి మూడు నెలల సమయం తీసుకున్నానని చెప్పారు. వైసీపీలో తనకు చాలా అన్యాయం జరిగిందని... అక్కడ నచ్చకే బయటకు వచ్చానని... బయటకు వచ్చిన తర్వాత ఆరు నెలలకు టీడీపీలో చేరానని తెలిపారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వివరాలను తెలిపారు.

ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఒకసారి తనతో మాట్లాడుతూ, 'అన్నా మీ లాంటి దళిత నేత మా పార్టీలో ఉంటే ఎక్కడి వరకైనా తీసుకెళతా'మని చెప్పారని... అప్పుడు, ఎక్కడి వరకు తీసుకెళతారంటూ తాను సరదాగా అడిగానని... కేవలం ప్యాంటు, చొక్కా వేసుకొస్తే చాలని, బాపట్లలో ఎంపీగా గెలిపించుకుని, పార్లమెంటు వరకు తీసుకెళతామని చెప్పారని తెలిపారు. ఆ తర్వాత కొంత కాలానికి చంద్రబాబును కలిశానని, లోకేష్ కూడా మాట్లాడారని, తదనంతరం టీడీపీలో చేరిపోయానని చెప్పారు.

More Telugu News