: నష్ట పరిహారం ఇవ్వనందుకు మొహాలీ రైల్వే స్టేషన్ ను అటాచ్ చేసిన కోర్టు

  • 1999లో భూమిని సేకరించిన రైల్వే శాఖ
  • పరిహారం ఇవ్వడంలో మీనమేషాలు లెక్కిస్తున్న అధికారులు
  • పలుమార్లు విచారణకు గైర్హాజరు
  • సీరియస్ గా స్పందించిన మొహాలీ స్థానిక కోర్టు

ఓ రైల్వే స్టేషన్ నిర్మాణం నిమిత్తం రైతుల నుంచి భూమిని తీసుకుని వారికి పరిహారం ఇవ్వని కారణంగా మొహాలీ రైల్వే స్టేషన్ తో పాటు రెండు రైలు ఇంజన్ లను అటాచ్ చేస్తున్నట్టు ఓ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 1999లో తన భూమిని తీసుకున్నారని, అప్పటి నుంచి ఇప్పటివరకూ నష్టపరిహారం ఇవ్వలేదని ఓ రైతు దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన మొహాలీ కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. రైల్వే స్టేషన్, ఇంజన్లతో పాటు రైల్వే శాఖ అధికారులు పర్యటించే అధికార వాహనాలను కూడా కోర్టు అటాచ్ చేసింది. కంబాలా గ్రామానికి చెందిన తన క్లయింట్ వేసిన పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టిందని, రైల్వే శాఖ పదే పదే విచారణకు గైర్హాజరు కావడంతోనే ఈ ఆదేశాలు వెలువడ్డాయని పిటిషనర్ల తరఫు న్యాయవాది గుర్వీందర్ సింగ్ సంధూ తెలిపారు.

 సెప్టెంబర్ 22కు కేసును వాయిదా వేశారని పేర్కొన్నారు. కాగా, ఈ అటాచ్ ఒక్క పిటిషన్ పై మాత్రమే కావడం గమనార్హం. ఈ ప్రాంతంలో రైతులకు రైల్వే శాఖ రూ. 1.7 కోట్లను నష్టపరిహారంగా చెల్లించాల్సి వుంది. ఎకరాకు రూ. 5.52 లక్షలు ఇస్తామంటూ భూమిని తీసుకున్న రైల్వే శాఖ డబ్బివ్వకపోగా, 2001లో దాన్ని ఎకరాకు రూ. 7.5 లక్షలకు పెంచింది. ఆపై 2004లో కోర్టు ఎకరాకు రూ. 23.34 లక్షలు ఇవ్వాలని ఆదేశించింది. నష్టపరిహారం ఇవ్వని రైల్వే శాఖ, పై కోర్టులకు వెళుతూ తమను ఇబ్బందులు పెడుతోందని, తాము వెనక్కుతగ్గే ప్రసక్తే లేదని రైతులు చెబుతున్నారు.

More Telugu News