: గప్ చుప్ గా ఉండండి...ప్రిన్స్ ఈజ్ బ్యాక్: బీసీసీఐ

టీమిండియాతో యువరాజ్ సింగ్ జతకలిశాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు ఎంపికైన యువరాజ్ సింగ్ ఇంగ్లండ్ చేరగానే అస్వస్థతకు గురయ్యాడు. దీంతో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన వార్మప్ మ్యాచ్ లో పాల్గొనలేదు. కనీసం ప్రాక్టీస్ లో కూడా పాల్గొనలేకపోయాడు. ఈ నేపథ్యంలో యువీ జట్టులో ఉంటాడా? లేక భారత్ బయల్దేరుతాడా? అన్న అనుమానం అందర్లోనూ రేగింది. ఈ క్రమంలో నేడు రెండో వార్మప్ మ్యాచ్ ను బంగ్లాదేశ్ జట్టుతో ఆడనున్న నేపథ్యంలో యువరాజ్ సింగ్ జట్టులోకి వచ్చాడని బీసీసీఐ ఆసక్తికరంగా ప్రకటించింది. అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా 'కీప్ కామ్... ప్రిన్స్ ఈజ్ బ్యాక్' అంటూ @యువీస్ట్రాంగ్ ని జతచేసింది. దీంతో టీమిండియా అభిమానుల్లో ఆనందం నెలకొంది. కీలక టోర్నీలో తీవ్రమైన ఒత్తిడిని తట్టుకుని అద్భుతంగా రాణించడం యువరాజ్ సింగ్ కు అలవాటు.

 అందుకే మూడు వరల్డ్ కప్ లు సాధించిన జట్టులో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించిన ఆటగాడిగా యువీని అభిమానులు ఆరాధిస్తారు. కేన్సర్ బారినపడి దానిని జయించి జట్టులో తిరిగి స్థానం సంపాదించగలిగాడంటే యువీ సామర్థ్యాన్ని, పోరాటపటిమను అంతా అర్థం చేసుకోవచ్చు. అలాంటి యువీ మళ్లీ జట్టుతో చేరడంతో టీమిండియా బలం ఆమాంతం పెరిగింది. ధావన్, రోహిత్ శర్మ, కోహ్లీ, రహానే, యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీ, హార్డిక్ పాండ్య, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలతో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. కేదార్ జాదవ్, దినేష్ కార్తీక్ లు స్టాండ్ బైలుగా ఉండనున్నారు. ఇక బౌలింగ్ విభాగం కూడా భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ ప్రీత్ బుమ్రా, హార్డిక్ పాండ్య, అశ్విన్, జడేజా, యువరాజ్ సింగ్ లతో పటిష్ఠంగా ఉంది. ఈ నేపథ్యంలో భారీ అంచనాల మధ్య టీమిండియా చాంపియన్స్ ట్రోఫీలో ఆడనుంది.



More Telugu News