: మాల్యా లేటెస్ట్ ఆఫర్... రూ. 6,868 కోట్లు చెల్లిస్తానని ప్రతిపాదన

బ్యాంకులకు రూ. 9 వేల కోట్లకు పైగా బకాయిలు పడ్డ యూబీ గ్రూప్ మాజీ అధినేత విజయ్ మాల్యా తాజాగా మరో ఆఫర్ ను చేశారు. గతంలో చెల్లిస్తానన్న రూ. 4,400 కోట్లకు అదనంగా మరో రూ. 2,468 కోట్లు డిపాజిట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నానని సుప్రీంకోర్టుకు తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంకు ఆయన రుణాన్ని చెల్లించాల్సి వున్న సంగతి తెలిసిందే. కాగా, ఇండియాకు తిరిగి ఎప్పుడు వస్తారన్న సుప్రీంకోర్టు ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం ఇవ్వలేదు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ నిర్వహణలో ఉన్న సమయంలో ఈ రుణాలను తీసుకోగా, పెరిగిన చమురు ధరలు, ఈ రంగంలోని పోటీ ఆ సంస్థను కుదేలు చేశాయి. దీంతో ఆ సంస్థ తీసుకున్న రూ. 6,107 కోట్ల రుణాల చెల్లింపు బాధ్యత మాల్యాపై పడింది. ఉద్యోగులకు సైతం మాల్యా బకాయిల చెల్లింపులు జరపాల్సివుంది. తన ముగ్గురు పిల్లలు సిద్దార్థ, లీనా, తాన్యాలు అమెరికా పౌరులని, 1996 నుంచి తాను భార్యతో కలిసి కాలిఫోర్నియాలో నివసిస్తున్నామని కోర్టుకు సీల్డ్ కవర్ లో వెల్లడించిన మాల్యా, తన పిల్లలు భారత సుప్రీంకోర్టు పరిధిలో లేరని తెలిపారు. ఇండియాలో ఉన్న ఆస్తుల వివరాలు వెల్లడించారు. తన విదేశీ ఆస్తులపై సమాచారం అడిగే హక్కు ఎవరికీ లేదని కూడా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News