: మోదీ కొత్త సంవత్సరం కానుక... షుగర్ టెస్టు నుంచి సీటీ స్కాన్ వరకూ అన్నీ ఉచితం!

కొత్త సంవత్సరం సమీపిస్తున్న శుభవేళ, భారతీయులకు నూతన సంవత్సరం బహుమతిగా ఉచిత రోగ నిర్థారణ పరీక్షా సేవలను అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అందించాలని మోదీ సర్కారు ఆదేశించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖల నుంచి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ ఆదేశాలు వెళ్లాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్త, మూత్ర పరీక్షలు, షుగర్, మలేరియా డెంగ్యూ, హెచ్ఐవీ వంటి పరీక్షలతో పాటు ఎక్స్ రే, సీటీ స్కాన్, అల్ట్రా సౌండ్ వంటి పరీక్షలనూ ఉచితంగా చేయాలని ఆదేశించింది. కొన్ని రాష్ట్రాలు అన్ని రకాల సేవలనూ అందించే పరిస్థితిలో లేనప్పటికీ, సాధ్యమైనన్ని ఎక్కువ సర్వీసులను ప్రజలకు దగ్గర చేయాలని, ఆపై దశలవారీగా అన్ని పరీక్షలనూ ఉచితంగా అందుబాటులోకి తేవాలని కోరింది. నేషనల్ హెల్త్ అస్యూరెన్స్ మిషన్ స్కీములో భాగంగా, ప్రజలందరికీ ఉచిత వైద్య సేవలను అందుబాటులోకి తెస్తామని మోదీ ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం 15 రాష్ట్రాల్లో కొన్ని పరీక్షలు ఉచితంగా ప్రజలకు అందుతున్నాయి. తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రం ప్రకటించకముందే ప్రభుత్వాసుపత్రుల్లో ఉచిత టెస్టింగ్ సేవలను అందించడం మొదలు పెట్టాయి.

More Telugu News