కన్నుల పండువగా ఏయూ అలుమ్ని-2015... విరాళాల వెల్లువ

13-10-2015 Tue 10:32

ప్రఖ్యాతిగాంచిన ఆంధ్ర యూనివర్శిటీ 'అలుమ్ని-2015' వేడుకలు నిన్న సాయంత్రం అట్టహాసంగా జరిగాయి. ఏయూలోని సీఆర్ రెడ్డి స్నాతకోత్సవ మందిరంలో పూర్వ విద్యార్థుల తొలి అపూర్వ సమ్మేళనం కన్నుల పండువగా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పారిశ్రామికవేత్తలు, ఉన్నతోద్యోగులు, పూర్వవిద్యార్థులు ఈ వేడుకకు తరలివచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, హార్వర్డ్, స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలు తొలి స్థానం కోసం పోటీ పడుతుంటాయని... అలాంటి వాతావరణమే ఇండియాలో కూడా ఉండాలని అభిలషించారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, విద్యార్థి సంఘాల నేతగా ఏయూ నుంచే తాను ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం చేపట్టానని గుర్తు చేసుకున్నారు. ఏయూని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా మార్చేందుకు, యూజీసీ నుంచి అన్ని ప్రయోజనాలు అందేలా చూస్తానని చెప్పారు. అంతేకాకుండా, ఏయూ పూర్వ విద్యార్థిగా రూ. కోటి సేకరించి వర్శిటీకి అందిస్తానని తెలిపారు. ఈ క్రమంలో, ఏయూ పూర్వ విద్యార్థుల సంఘాన్ని ఏర్పాటు చేసి, దానికి అధ్యక్షుడిగా జీఎంఆర్ అధినేత గ్రంధి మల్లికార్జునరావును ఎంపిక చేశారు. మరో గొప్ప విషయం ఏమిటంటే, పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పడిన తొలిరోజే రూ. 13.75 కోట్ల విరాళాలు అందాయి. ఈ సందర్భంగా చంద్రబాబు స్పందిస్తూ, ప్రభుత్వం తరఫున మరో రూ. 13.75 కోట్లను ఇస్తున్నట్టు ప్రకటించారు. అంతకు ముందు సినీ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ రెండు పాటలను పాడి అలరించారు. మాజీ డీజీపీ హెచ్ జే దొర మాట్లాడుతూ, ఎకనామిక్ విభాగంలో తాను చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. ఉన్నత విద్యలో చైనా దూసుకుపోతోందని, దానికి దీటుగా మనం కూడా పయనించాలని పిలుపునిచ్చారు.