: బెస్ట్ వాహన రుణం పొందడం ఎలా?... తెలుసుకోండిలా!

కంటి ముందు మిలమిలా మెరిసిపోయే కారు, దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంటికి తీసుకువెళ్లాలని కోరుకునే మనస్సు... వెరసి రుణ పత్రాలపై పదుల సంఖ్యలో సంతకాలు పెడుతున్నప్పుడు, సదరు అగ్రిమెంటులో ఏముందో, ఏఏ లొసుగులున్నాయో, ఏమేం నిబంధనలను అంగీకరిస్తున్నామో పూర్తిగా తెలుసుకోకుండానే అడుగేసేస్తాం. దీని ఫలితంగా, తీసుకున్న రుణ మొత్తంపై చెల్లించాల్సిన దానికన్నా, రూ. 30 నుంచి రూ. 50 వేల వరకూ అధికంగా కట్టాల్సి వస్తుంది. కాస్త జాగ్రత్తగా వుండి మరో మూడు నాలుగు గంటల సమయం కేటాయిస్తే, ఈ అదనపు బాదుడును సులువుగానే తప్పించుకోవచ్చు. ఎక్స్ షోరూం ధరపై డిస్కౌంట్, వాహన రుణంతో పాటు బీమా సదుపాయం, డీలర్ తరపున ప్రత్యేక వారంటీ... ఇలాంటి ఆఫర్లను చూసి అది 'బెస్ట్ లోన్' అనుకుంటే పప్పులో కాలేసినట్టే. కొనే కారుకు 3 నుంచి 10 లక్షల వరకూ రుణంగా తీసుకుంటున్నామంటే, అందులో డీలర్ కమీషన్ రెండు నుంచి మూడు శాతం వరకూ ఉంటుంది. అందువల్లే వాహన రుణాన్ని తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకు సాగాలి. వాహన రుణాన్ని ఫైనలైజ్ చేసేముందు, ఒకరికన్నా ఎక్కువ మంది డీలర్లను సంప్రదించాలి. మార్కెట్లో లభించే వాహన రుణాలను పోలుస్తూ, సమాచారాన్ని అందించేందుకు పదుల కొద్దీ వెబ్ సైట్లు సిద్ధంగా ఉన్నాయి. వాటిల్లోంచీ సమాచారాన్ని సేకరించుకోవాలి. అన్ని రకాల రుణాల్లానే ఆటో లోన్ కూ వడ్డీ చెల్లించాల్సిందే. ప్రాసెసింగ్ ఫీజు, నెలసరి కిస్తీలు సక్రమంగా చెల్లించకపోతే జరిమానాలు, ముందుగానే రుణాన్ని ముగించాలంటే పెనాల్టీ తదితరాలు ఉంటాయి. 'బెస్ట్' వాహన రుణం అంటే, మిగతా బ్యాంకులతో పోలిస్తే వడ్డీ తక్కువగా ఉంటూ, ప్రాసెసింగ్ ఫీజలో రాయితీ, ముందస్తు చెల్లింపులపై పెనాల్టీ లేకుండా ఉండాలి. దాన్ని అత్యుత్తమ వాహన రుణంగా భావించవచ్చు. సాధారణంగా వాహన రుణంపై ప్రాసెసింగ్ ఫీజు కారు ఖరీదును బట్టి అర శాతం నుంచి రెండు శాతం వరకూ ఉంటుంది. అంటే, ఓ రూ. 10 లక్షల విలువైన కారును కొంటే, రూ. 20 వేల వరకూ ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాల్సి వుంటుంది. దీన్ని కూడా రుణంలో కలిపి తీసుకుంటే, దానిపై వడ్డీ పడుతుంది. బేరం చేసి ఈ ప్రాసెసింగ్ ఫీజును అర శాతానికి తగ్గించుకోవచ్చు. ఇలా చేస్తే రూ. 15 వేల వరకూ ఆదా చేసుకోవచ్చు. అత్యధిక సందర్భాల్లో ఏజంట్లు రుణం గురించిన పూర్తి వివరాలు చెప్పరు. వారు చెప్పకపోయినా, రుణ మొత్తం ఎంత? అది తీరేవరకు ఎంత చెల్లించాల్సి వస్తుంది? అన్నది తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవడం సులభమే. అన్ని ఇఎంఐలు, ప్రాసెసింగ్‌ ఫీజు కలిపిన మొత్తం నుంచి డౌన్‌ పేమెంట్‌ను తీసేస్తే రుణ గ్రహీత చెల్లించాల్సిన డబ్బు ఎంతన్న విషయం తెలుస్తుంది. ఇక చివరిగా కారు ధరను బట్టి రుణ మొత్తంపై వడ్డీ రేటు మారుతూ ఉంటుంది. ఖాతాను నిర్వహిస్తున్న బ్యాంకు నుంచే రుణం తీసుకునే పక్షంలో, మార్కెట్ తో పోలిస్తే కనీసం ఒక శాతం వరకూ వడ్డీ తగ్గే అవకాశాలు ఉంటాయి. మంథ్లీ రిడక్షన్ విధానంలో రుణం తీసుకుంటే మేలు కలుగుతుంది. సాధ్యమైనంత ఎక్కువ డౌన్ పేమెంట్ కట్టేందుకు ప్రయత్నిస్తే వడ్డీల భారం గణనీయంగా తగ్గుతుంది.

More Telugu News