భగవంతుడి సేవకు మించిన భాగ్యం లేదు

ఎవరు ఎక్కడ వున్నా ... ఏ ఉద్యోగమో ... వ్యాపారమో చేస్తున్నా, పుట్టి పెరిగిన ఊరునీ ... చదువుకున్న బడినీ ... అమ్మతో కలిసి వెళ్లిన గుడిని మరిచిపోలేరు. జీవితంలో నిరాశా నిస్పృహలు అలుముకున్నప్పుడు ... వీటిని ఒక్కసారి గుర్తుచేసుకుంటే చాలు, కొత్త ఉత్సాహం వస్తుంది ... కొండంత బలాన్ని ఇస్తుంది.

అయితే తీరిక లేని పనులంటూ, పుట్టి పెరిగిన ఊరుకి సంవత్సరాలుగా వెళ్లని వాళ్లు ఎంతోమంది వుంటారు. వాళ్లంతా ఒకసారి తీరిక చేసుకుని సొంత ఊరుకి వెళితే, వాళ్లలో కొంతమందికైనా .. గత వైభవాన్ని కోల్పోయిన తమ ఊరి దేవాలయం కనిపిస్తుంది. వెలవెలబోతున్న గోడలు ... పైకప్పు దెబ్బతిన్న మంటపాలు ... కూలిపోయిన రథశాల ... విరిగిపోయిన రథం ... కనిపిస్తాయి.

తనలాంటి వాళ్ల మూలంగానే తమ ఊరి దేవుడికి ఆ పరిస్థితి వచ్చిందనే విషయం అప్పుడు బోధపడుతుంది. తల్లిదండ్రులను ... స్నేహితులను మరిచిపోతే వాళ్లు వెంటనే గుర్తుచేస్తారు. కానీ తమకి అన్నీ ఇచ్చి ఏమీ అడగని దేవుడిని చూస్తే ఎవరికైనా ఏడుపు ఆగదు. ఇలాంటి అనుభూతికి లోనైన వాళ్లందరూ, ఆలయ పునరుద్ధరణకు పూనుకోకుండా ఉండలేరు.

తమలాగే ఆ ఊరు నుంచి వెళ్లిపోయి మరోచోట స్థిరపడిన వారి చిరునామాలను సేకరిస్తారు. ఆలయ పునరుద్ధరణలో వారి సాయాన్ని కోరతారు. అలాగే గ్రామస్తుల సహాయ సహకారాలను తీసుకుంటారు. కొత్త నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. స్వామివారి వైభవానికి తగినట్టుగా వివిధ రకాల వాహనాలను తయరుచేయిస్తారు. భగవంతుడికి జరిపే ఉత్సవాలకు అవసరమైన సొమ్మును ఆయన పేరున జమచేస్తారు. అలాంటివారి కృషి ఫలితంగా ఆలయం అందంగా ముస్తాబై కనిపిస్తుంది.

అందంగా తీర్చిదిద్దబడిన ఆలయంలో భగవంతుడు ఇప్పుడు మురిసిపోతూ కనిపిస్తుంటాడు. చిన్నప్పుడు కొత్తబట్టలు వేసుకున్నప్పుడు కలిగిన ఆనందం ... జీవితంలో ఒక స్థాయికి చేరుకున్న తరువాత కొత్త కారు కొనుక్కున్నప్పుడు కలిగిన ఆనందం ఇప్పుడు చాలా చిన్నవిగా కనిపిస్తుంటాయి. అసలైన ఆనందమనేది భగవంతుడి సేవలోనే వుందనిపిస్తుంది. భగవంతుడి సేవకి మించిన భాగ్యం లేదనిపిస్తుంది.


More Bhakti News