భక్తి లేదంటే ముక్తి లేనట్టే

భగవంతుడి తత్త్వాన్ని అర్థం చేసుకోవడానికీ ... ఆయన అనుగ్రహాన్ని పొందడానికి మనసు నిండుగా భక్తి వుండాలి. హృదయమనే ఉద్యానవనంలో భక్తి కుసుమం వికసించినప్పుడు, సహజంగానే వారి ప్రవర్తనలో మార్పువస్తుంది. సమస్త విశ్వాన్ని నడిపించే నాయకుడు భగవంతుడేననే ఆలోచన కలుగుతుంది. ఆయన ఆజ్ఞ ... అనుమతి లేకుండా ఏదీ జరగదనే విశ్వాసం కలుగుతుంది. తమతోపాటు అందరికీ మంచి జరగాలనీ ... పదిమందికీ సాయపడాలని అనిపిస్తుంది.

ప్రపంచమంతా ప్రశాంతంగా కనిపిస్తూ వుందంటే ... ప్రజలంతా తన వాళ్లేనని అనిపిస్తుందంటే ... జీవరాసుల పట్ల ప్రేమ పెరిగిందంటే, భక్తి మార్గంలో కొంతదూరం నడిచినట్టేనని చెప్పుకోవాలి. అలా మంచి మనసును కలిగి నిరంతరం దైవ ధ్యానంలో గడిపేవారికి తప్పకుండా ముక్తి లభిస్తుంది. అలా కాకుండా కొంతమంది ఇరుగింటి వాళ్లో ... పొరుగింటి వాళ్లో వెళ్లారని తాముకూడా గుడికి వెళుతూ వుంటారు. తమకి కూడా భక్తి బాగానే వుందని నిరూపించడం వాళ్ల ప్రధాన ఉద్దేశం.

పక్కింటి వాళ్లతో పోటీపడుతూ వాళ్లు ఏది చేస్తే ... తాము అది చేయడం ఈ కాలంలో ఎక్కువగా కనిపిస్తూ వుంటుంది. ఇదే ఆలోచనను వాళ్లు గుడి విషయంలోనూ కొనసాగిస్తూ వుంటారు. సరదాగా అలా గుడికి వెళ్ళొచ్చామని చుట్టుపక్కల వాళ్లందరికీ గొప్పగా చెప్పేస్తుంటారు. తాము గుడికి వెళ్ళిరావడం వలన దేవుడికేదో కలిసి వచ్చినట్టుగా వాళ్ల ధోరణి వుంటుంది. నిజానికి ఇది వాళ్ల అమాయకత్వానికి నిదర్శనం.

గుడికి ఎప్పుడూ కూడా సరదాగా వెళ్లకూడదు ... భగవంతుడిపై భక్తితో మాత్రమే వెళ్లాలి. ఎవరు ఏ ఉద్దేశంతో ... ఎంత భక్తితో వచ్చారనేది తోటి భక్తులకు తెలియకపోవచ్చునేమో గానీ, భగవంతుడికి తెలియకుండా ఎలా వుంటుంది ? భక్తి అనేది ఒకరిని చూసి తెచ్చుకునే అలంకారప్రాయమైన వస్తువు కాదు. అది హృదయంలోనే ఉదయంలా వికసించాలి ... పదిమందికీ అనుభూతి పరిమళాలను పంచాలి. చాలామంది భక్తి లేకపోవడమనేది భారీ లోపమేమీ కాదని అనుకుంటూ వుంటారు. అలాంటి వాళ్లందరూ 'భక్తి లేకపోతే ముక్తి లేనట్టే'నని గ్రహించాలి.


More Bhakti News