దుష్ట శక్తులను హడలెత్తించే హనుమంతుడు

హనుమంతుడు మహా శక్తిమంతుడు ... అంతకుమించిన యుక్తిమంతుడు. అటు భుజబలం ... ఇటు బుద్ధిబలం ఉన్నప్పటికీ, సమయాన్ని ... సందర్భాన్ని బట్టి వాటిని తగినంతగా ఉపయోగించడం తెలిసినవాడు. సూర్యుడిని గురువుగా ... సూర్య వంశపు రాజైన శ్రీరాముడిని ప్రభువుగా భావించిన హనుమంతుడి విజయాల వెనుక సాహసం - సమయస్పూర్తి సమపాళ్లలో కనిపిస్తాయి.

సూర్యుడి అనుగ్రహం హనుమంతుడి పట్ల మెండుగా వుండటం వలన ఆయన పట్ల ... ఆయన భక్తుల పట్ల ప్రభావం చూపడానికి మిగతా గ్రహాలు వెనుకడుగు వేస్తాయి. ఇక శివాంశ సంభూతుడు కావడం వలన భూత ప్రేత పిశాచాలు ఆయన వున్న చోటుకి కనుచూపుమేర వరకూ కనిపించకుండాపోతాయి. అందుకే హనుమంతుడిని దర్శించే భక్తులు ... ఆయనని అనునిత్యం ఆరాధించే భక్తులు పెద్ద సంఖ్యలో వుంటారు.

అలా నిత్యం రద్దీగా కనిపించే హనుమ ఆలయం హైదరాబాద్ - బేగంపేటలో దర్శనమిస్తుంది. ఓ భక్తుడి సంకల్ప బలం కారణంగా చాలాకాలం క్రితమే ఇక్కడ హనుమంతుడి ఆలయం నిర్మించబడింది. అందంగా తీర్చిదిద్దబడిన ఇక్కడి ఆలయంలో స్వామివారి ప్రతిమ కుదురుగా ఆకర్షణీయంగా కొలువై వుంటుంది. ఇక్కడి స్వామివారి పట్ల విశ్వాసంతో మండల దీక్షను స్వీకరించినా ... ప్రదక్షిణలు చేసినా కార్యసిద్ధి కలుగుతుందని చెబుతారు.

ఇక్కడి హనుమంతుడిని నమ్ముకుని ఆపదల నుంచి ... అనారోగ్యాల నుంచి ... దుష్ట శక్తుల బారి నుంచి బయట పడిన వాళ్లు ఎక్కువగా కనిపిస్తారు. మంగళవారం రోజున ఆలయాన్ని దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది. హనుమజ్జయంతి ... శ్రీ రామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించిన భక్తులు కానుకలు ... మొక్కుబడులు సమర్పిస్తూ తరిస్తుంటారు.


More Bhakti News