కార్తీక పూజా ఫలం

కార్తీక పూజా ఫలం
జీవితం సాఫీగా సాగిపోతున్నప్పుడే మనసు ప్రశాంతంగా వుంటుంది. సపద ... సంతానం ... సౌభాగ్యం తదితర విషయాల్లో సంతృప్తికరంగా ఉన్నప్పుడే మనసు ప్రశాంతంగా వుంటుంది. ఇక ఆ సంపద ... సంతాన సౌభాగ్యాలు కావాలంటే దానికి దేవుడి అనుగ్రహం కావాలి. అలాంటి దేవుడి కరుణాకటాక్ష వీక్షణాలను తేలికగా పొందడానికి అవకాశాన్ని కల్పించేదే కార్తీకమాసం. ఈ కారణంగానే వివిధ ప్రాంతాలలోని శివాలయాలు భక్తులతో రద్దీగా కనిపిస్తుంటాయి.

కార్తీక మాసంలో ఏ శివాలయాన్ని దర్శించినా పుణ్యమే లభిస్తుంది. అయితే విశిష్టమైన క్షేత్రాలను దర్శించడం వలన, మరిన్ని ఉత్తమైన ఫలితాలు కలుగుతాయని చెబుతుంటారు. అందువల్లనే చాలామంది ఈ మాసంలో 'పంచారామాలు'ను ... 'ద్వాదశ జ్యోతిర్లింగాలు' ను దర్శించి తరిస్తుంటారు. 'అమరారామం' ... 'సోమారామం' ... 'క్షీరారామం' ... 'ద్రాక్షారామం' ... 'కుమారారామం' అనే ఈ పంచారామాలను కార్తీక మాసంలో దర్శించి పూజించడం వలన కష్టాలు కనుమరుగవుతాయనీ, దోషాలు పరిహారమవుతాయని అంటారు.

అలాగే పరమ శివుడు సోమనాథుడుగా .. శ్రీశైల మల్లికార్జునుడుగా .. ఓంకారేశ్వరుడుగా ... మహాకాలేశ్వరుడుగా .. కేదారనాథుడుగా .. భీమశంకరుడుగా .. విశ్వనాథుడుగా .. త్రయంబకేశ్వరుడుగా .. వైద్యనాథుడుగా .. నాగేశ్వరుడుగా రామేశ్వరుడుగా .. ఘుశ్మేశ్వరుడుగా ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో పూజలు అందుకుంటున్నాడు. కార్తీకమాసంలో ఒక్కో జ్యోతిర్లింగాన్ని దర్శించడం వలన ఒక్కో ఫలితం చెప్పబడింది. ఇక ఈ మాసంలో ఏ ఒక్క జ్యోతిర్లింగాన్ని దర్శించినా, సమస్త పాపాలు ... దోషాలు తుడిచిపెట్టుకుపోతాయి ... సంతోషాల నిచ్చే సకల సిరిసంపదలు చేకూరతాయని పురాణాలు చెబుతున్నాయి.

More Bhakti Articles