కబీరు గొప్పతనం

కబీరు గొప్పతనం
శ్రీరాముడి భక్తుడైన కబీరుదాసు ... రామానందుల వారిని తన గురువుగా భావిస్తూ అనునిత్యం ఆయనని దర్శించుకునేవాడు. అయితే రామానందుల వారిని కబీరు గురువుగా భావిస్తూ వుండటం పట్ల అతని మతస్తులు తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేయసాగారు. ఇక కబీరును రామానందుల వారు ఆదరిస్తూ ఉండటాన్ని ఆశ్రమంలో గల శిష్యులు సహించలేక పోతుండేవారు.

ఈ నేపథ్యంలోనే ఓ రోజు ఉదయాన్నే కబీరు హడావిడిగా రామానందుల వారి ఆశ్రమానికి వచ్చాడు. ఆ సమయంలో పూజకు సిద్ధమవుతోన్న రామానందులవారు, విషయమేవిటని అడిగాడు. పూజకి ఆయన శిష్యులు తులసిని సిద్ధం చేయడం మరిచిపోయారనీ, అందువలన తాను తులసిని తీసుకువచ్చానని చెబుతాడు కబీరు .

ఎక్కడో వున్న కబీరు ఆ విషయాన్ని గమనించడం రామానందుల వారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దాంతో కబీరు ఓ సాధారణమైన వ్యక్తి కాదనే విషయం ఆయనకి అర్థమైపోతుంది. అదే సమయంలో కాశీరాజు రాచపుండుతో బాధపడుతున్నాడని తెలిసి, ఆయన కబీరును వెంటబెట్టుకు వెళతాడు. తండ్రి ద్వారా సిద్ధ వైద్యంలో అనుభవం సంపాదించిన కబీరు, ఊహించనంత త్వరగా కాశీరాజు రాచపుండును నయంచేస్తాడు.

ఆ సంతోషంతో కాశీరాజు తన అర్థ రాజ్యాన్ని స్వీకరించ వలసిందిగా కబీరును కోరతాడు. శ్రీరాముడి సన్నిధిలో గల సుఖం మరెక్కడా ఉండదనీ, ఆయన సేవకి మించిన భాగ్యం మరేదీ లేదని సున్నితంగా తిరస్కరిస్తాడు కబీరు. ఆయన నిరాడంబరత పట్ల ... అసమానమైన ఆయన భక్తిశ్రద్ధల పట్ల కాశీరాజు ఆనందాశ్చర్యాలను వ్యక్తం చేస్తాడు. కబీరు గొప్పతనాన్ని ప్రత్యక్షంగా చూసిన అక్కడి వాళ్లు ఆయనని ఎంతగానో ప్రశంసిస్తారు.

More Bhakti Articles