పాలంకేశ్వర స్వామి

పాలంకేశ్వర స్వామి
భక్తికి ... భక్తులకు ... భయమనేది ఆమాడ దూరంలో ఉంటుందేమో, అందుకే నల్లమల వంటి అడవులను సైతం వారు అనుభూతి చెందుతూ దాటుతుంటారు. తమ ఇష్ట దైవాన్ని దర్శించి కష్టాలను మరిచిపోతుంటారు. సదా సదాశివుడిని స్మరిస్తూ ... క్రూర మృగాలు సంచరించే నల్లమల అడవి మీదుగా భక్తులు కృష్ణా నదీ తీరంలోని 'పాలంక తీర్థం' చేరుకుంటారు. ఈ ప్రదేశంలోనే పాలంకేశ్వరుడు ... కాళికాదేవి కొలువుదీరి వున్నారు. ఇక్కడి అమ్మవారిని గిరిజనులు 'పుట్టల్లమ్మ తల్లి' గా పిలుచుకుంటూ వుంటారు.

ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం సమీపంలోని ఈ క్షేత్రంలో ప్రతి ఏకాదశి ... ద్వాదశి రోజుల్లో ఉత్సవాలు జరుగుతూ వుంటాయి. జానపదుల సంప్రదాయ పద్ధతిలోనే ఆడుతూ పాడుతూ భక్తులు ఏకాదశి రోజున జాగారం చేస్తారు. ఈ రోజున పాలంకేశ్వరుడిని దర్శించేందుకు, ఆయన సన్నిధిలో తరించేందుకు చుట్టుపక్కల ప్రాంతాలలోని భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటారు.

ప్రకృతి ఒడిలో సేదతీరుతున్నట్టుగా కనిపించే ఈ క్షేత్రంలో, పరమశివుడి కొప్పులో నుంచి దూకుతున్నట్టుగా జలపాతం కనిపిస్తుంది. పంచలింగాలను ఈ జలపాతం అభిషేకిస్తుండటం చూస్తే మనసు పరవశించిపోతుంది. ఈ నీరు దోసిటిలో పట్టి తాగినవారికి సంతానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు. అందువలన సంతానంలేని స్త్రీలు ఆ నీటిని తీర్థంగా స్వీకరిస్తుంటారు. ఇక్కడి దైవం కారణంగా సంతానాన్ని పొందిన వారు ... పుట్టు వెంట్రుకలను ఇక్కడే తీయిస్తుంటారు. కాళికా సమేత పాలంకేశ్వరుడికి కృతజ్ఞతలు తెలుపుతూ వెళుతుంటారు.

More Bhakti Articles