పాతాళ పరమేశ్వరుడు

పాతాళ పరమేశ్వరుడు
అడుగడుగునా ... అణువణువునా పరమేశ్వరుడు తన లీలా విశేషాలను ఆవిష్కరిస్తూ వుంటాడు. ఈ నేపథ్యంలోనే లింగరూపంలో ఆ స్వామి ఆవిర్భవించిన ప్రదేశాలు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రాలుగా అలరారుతున్నాయి. ఎందరో మహర్షులు లోక కల్యాణం కోసం ఆ స్వామిని గురించి తపస్సులు చేశారు. మరెందరో రాజులు విజయాలను ఆశిస్తూ స్వామి అనుగ్రహం కోసం యజ్ఞయాగాలు నిర్వహించారు. మరెందరో మహనీయులు స్వామిని తమ ఇలవేల్పుగా భావించి అనునిత్యం ఆరాధించారు.

అలాంటి వారందరిచే ఆరాధించబడుతోన్నపాతాళ పరమేశ్వరుడు, ఖమ్మం జిల్లా మణుగూరులో దర్శనమిస్తాడు. గర్భాలయంలో ప్రతిష్ఠించబడిన ఒక శివలింగం వుండగా, గర్భాలయపు నేలమాళిగలో స్వయంభువు శివలింగం దర్శనమిస్తూ వుండటం ఇక్కడి విశేషంగా చెప్పవచ్చు. పాతాళ శివలింగం చెంత మహర్షులు తపమాచరించేవారనీ, అక్కడి శివలింగాన్ని అందరూ ఒక్కసారిగా దర్శించలేరు కాబట్టి ఆ తరువాత కాలంలో పై భాగంలో మరో శివలింగాన్ని ప్రతిష్ఠించి ఉంటారని అంటారు.

ప్రాచీనకాలానికి చెందిన ఇక్కడి శివుడికి కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్రుడు ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. కాలక్రమంలో ఆ ఆలయం శిధిలావస్థకు చేరుకోగా, శివలింగం అంతర్హితమైపోయింది. చాలాకాలం క్రిందట ఒక భక్తుడు ఈ ప్రదేశంలో విశ్రాంతి తీసుకుంటూ వుండగా, స్వామి తన ఉనికిని తెలియజేశాడట. ఆ ప్రకారం అక్కడి నేలను తవ్వగా శివలింగం బయటపడింది. నేలమాళిగలో గల శివుడిని పాతాళ పరమేశ్వరుడుగా, పైభాగాన గల శివుడిని నీలకంఠస్వామిగా భక్తులు కొలుస్తుంటారు.

భక్తుల సహాయ సహకారాలతో ఆలయ పునఃనిర్మాణం జరిగింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ... సువిశాలమైన ప్రాంగణంతో ఈ ఆలయం అలరారుతూ వుంటుంది. కార్తీక మాసంలో భక్తులు విశేష సంఖ్యలో ఇక్కడి స్వామివారిని దర్శించుకుంటూ వుంటారు. అమ్మవారు 'సర్వమంగళ' పేరుతో పూజలు అందుకుంటోన్న ఈ క్షేత్రంలో, శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు ... విశేష ఉత్సవాలు జరుగుతుంటాయి.

More Bhakti Articles