దేవుడిని పెళ్లాడిన భక్తురాలు

దేవుడిని పెళ్లాడిన భక్తురాలు
గోదాదేవి తన అసమానమైన భక్తితో రంగనాయకస్వామిని పెళ్లి చేసుకుందని తెలిసినది మొదలు, తాను కూడా దేవుడిని పెళ్లి చేసుకోవాలని మొల్ల నిర్ణయించుకుంటుంది. ఈ విషయం తెలిసి గ్రామపెద్దలు ఆమెను అవహేళన చేస్తారు. తాము ఇచ్చిన గడువులోగా ఆమె దేవుడిని పెళ్లిచేసుకోవాలని ఆదేశిస్తారు. దాంతో దేవుడిని వెదుక్కుంటూ మొల్ల బయలుదేరుతుంది.

దేవుడుఎక్కడ ఉంటాడో ... ఎలా ఉంటాడో తెలియదు. ఆయన ఎదురైతే ఎలా గుర్తించాలో తెలియదు. అయినా ఆమె అలా ముందుకు సాగుతూనే వుంటుంది. ఎంత దూరం ప్రయాణించినా దేవుడు కనిపించకపోవడంతో ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడుతుంది. కోయదొర వేషంలో ప్రత్యక్షమై ఆమెను అడ్డుకుంటాడు విష్ణుమూర్తి.

భగవంతుడిని పెళ్లి చేసుకోవడం కోసం తాను బయలుదేరాననీ, ఆయన ఆచూకీ తెలియక పోవడం వలన ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నానని చెబుతుంది మొల్ల. తానే భగవంతుడినని ఆయన ఎంతగా చెప్పినా మొల్ల వినిపించుకోకపోవడంతో, తన నిజరూపాన్ని ఆవిష్కరిస్తాడు శ్రీమహావిష్ణువు. భగవంతుడే తన కోసం దిగి వచ్చినందుకు మొల్ల సంతోషంతో పొంగిపోతుంది. అక్కడే వారిద్దరూ వివాహం చేసుకుంటారు.

పూలదండలు అలంకరించుకుని గ్రామానికి ఒంటరిగా తిరిగి వచ్చిన మొల్లను అంతా విచిత్రంగా చూస్తారు. జరిగిందంతా తన తండ్రి కేశనతో చెప్పి మొల్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. అయితే తండ్రితో పాటు గ్రామస్తులంతా ఈ విషయాన్ని విశ్వసించాలో లేదో తెలియని సందిగ్ధంలో పడతారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన రామలింగకవి, ఆమె మాటల్లోని నిజాన్ని గ్రహించి ఆ విషయాన్ని అందరికీ స్పష్టం చేస్తాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే తనకి అల్లుడు కావడంతో కేశన కళ్ళు ఆనందబాష్పలను వర్షిస్తాయి.

More Bhakti Articles