వివాహ ప్రదక్షిణం

వివాహ ప్రదక్షిణం
వివాహం అయిన వారికి అది పెద్ద సమస్యగా కనిపించదు గానీ, కాని వారికి అంతకి మించిన సమస్యలేదు. ఇటు అబ్బాయిలు ... అటు అమ్మాయిలు తమ ఫోటోలను, జాతక చక్రాలను మధ్యవర్తులకు అందజేసే పనిలో తీరికలేకుండా వుంటారు. అయినా అనేక కారణాల వలన సంబంధాలు మాత్రం తప్పిపోతుంటాయి. అందం .. చదువు .. వుద్యోగం ... సంపాదన వున్నా ఎందుకిలా జరుగుతుందో తెలియక వాళ్లు తికమక పడిపోతుంటారు.

ఈ నేపథ్యంలో కనిపించిన ఆలయాల చుట్టూ తిరిగేవారు కొందరైతే, దోషాలు - పరిహారాలు అంటూ తిరిగేవారు మరికొందరు. ఇలాంటి సమయంలో పిల్లల వివాహానికి సంబంధించిన ప్రస్తావన ఎవరైనా తెస్తే, ఇక వారి తల్లిదండ్రుల ఆందోళన మాటల్లో చెప్పడానికి వీలులేనంతగా వుంటుంది.

ఫలాన క్షేత్రానికి వెళ్లి దైవదర్శనం చేసుకుంటే వెంటనే వివాహం అవుతుందని ఎవరైనా చెబితే వెంటనే వాళ్లు అక్కడికి ప్రయాణం కడుతుంటారు. అలా వివాహం కాని వారు దైవ దర్శనానికి రాగానే ఇలా సంబంధాలు కుదిరిపోయే క్షేత్రాలు కొన్ని తమిళనాడులో దర్శనమిస్తాయి. ఈ క్షేత్రాలను దర్శిస్తే ఎలాంటి దోషాలైనా తొలగిపోతాయనీ, అతి త్వరలోనే సంబంధాలు కుదిరిపోతాయని ఇక్కడి వారు విశ్వసిస్తూ వుంటారు.

అలా వివాహం జరిపించే క్షేత్రాల జాబితాలో మధురై .. తిరుమణంజేరి .. నాచ్చియార్ ఆలయం .. ముదిచూర్ .. ఉప్పిలియప్పన్ .. తిరుచ్చేరై .. తిరువిడనత్తై .. తిరునల్లూరు .. వంటి క్షేత్రాలు దర్శనమిస్తుంటాయి. ప్రదక్షిణ మార్గంలో ఈ క్షేత్రాలన్నింటినీ ఒకసారి చుట్టబెట్టినట్టయితే, ఏడడుగులు వేయడానికి ఎక్కువ సమయం పట్టదని అనుభవపూర్వకంగా చెబుతుంటారు.

More Bhakti Articles