సకల దైవ స్వరూపమే సాయి

సకల దైవ స్వరూపమే సాయి
శిరిడీ గ్రామ ప్రజలు సాయిని ఒక బిడ్డగా ... తండ్రిగా .. గురువుగా ... దైవంగా భావించసాగారు. అనునిత్యం ఆయనకి సేవలు చేస్తూ ... ఆయనకి వంటకాలు చేసిపెడుతూ తమ అనురాగాన్ని చాటుకోసాగారు. ఆయన చిన్నపిల్లవాడిగా మారాం చేస్తున్నా పట్టించుకోకుండా స్నానం చేయించి, తాము కోరుకున్న విధంగా అలంకరణ చేసేవారు.

ఇలాంటి సందడితో ఎప్పుడు చూసినా మశీదులో పండుగ వాతావరణం కనిపిస్తూ వుండేది. అయితే ఇదంతా చూసిన ఓ వ్యక్తి తీవ్రమైన అసహనానికి లోనయ్యాడు. సాయిబాబా తమ మతానికి చెందినవాడనీ, తమ మతానికి విరుద్ధమైన అలంకరణలు చేయవద్దని అక్కడి వారిని అడ్డుకున్నాడు. అందుకు సమాధానంగా అక్కడి వారంతా బాబా వైపు చూశారు. మానవత్వమే తన మతమనీ, అంతా తనవారేనని చెప్పాడు బాబా.

సాయి సమాధానాన్ని ఆ వ్యక్తి అవమానంగా భావించాడు. అక్కడివారిని సమర్ధిస్తూ తనని సాయి వేరుగా చూశాడనే కోపంతో విసవిసా వెళ్లిపోయాడు. సాయిని సేవిస్తున్న భక్తులను నిందించడం వలన ప్రయోజనం లేదనీ, జరుగుతున్న దానికి కారకుడైన సాయి సంగతినే చూడాలని ఆ వ్యక్తి నిర్ణయించుకున్నాడు. ఓ రాత్రివేళ మశీదుకి దూరంలో కాపుగాశాడు. బిక్షాటన పూర్తిచేసుకుని తిరిగివస్తోన్న సాయిని రహస్యంగా అనుసరించాడు.

కర్రతో సాయి తలపై బలంగా కొట్టడానికి సిద్ధమయ్యాడు. అంతే అతని కాళ్లు ... చేతులు ఎక్కడికక్కడ బిగుసుకుపోయాయి. వెనుదిరిగి చూసిన సాయిలో అతనికి సకల దేవతలు కనిపించారు. శిల్పంలా వున్న అతను సాయి స్పర్శతో మామూలు స్థితికి వచ్చాడు. తనని మన్నించమంటూ బాబా పాదాలపై పడ్డాడు. ఆ రోజు నుంచి అతను కూడా బాబా భక్తుల్లో ఒకడిగా ఆయనని సేవించుకుంటూ గడిపాడు.

More Bhakti Articles