కార్తీకంలో కరుణించే శివుడు

కార్తీకంలో కరుణించే శివుడు
సదాశివుడు తన భక్తులను సదా కాపాడుతూ ఉంటాడు. నిస్వార్ధంతో నిరంతరం తన నామస్మరణ చేసే భక్తులను మృత్యువు బారిన పడకుండా రక్షిస్తుంటాడు. ఈ విషయంలో యమధర్మరాజును సైతం అయన ఎదిరించిన ఘట్టం మార్కండేయుడి జీవిత చరిత్రలో స్పష్టమవుతుంది. మార్కండేయుడు పరమ శివభక్తుడు. తన ఆయువుతీరనున్న సమయంలో ఆ బాలుడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు.

ఆ పిల్లవాడిపైకి యమధర్మరాజు విసిరిన పాశం ... శివలింగానికి కూడా చుట్టుకుంటుంది. అది గమనించని యముడు అలాగే పాశాన్ని లాగాడు. ఆగ్రహావేశాలకు లోనైన శివుడు వెంటనే అక్కడ ప్రత్యక్షమై యమధర్మరాజుని సంహరించాడు. ఆ తరువాత సమస్త దేవతల ప్రార్ధనమేరకు ఆయన్ని బతికించాడు. తన భక్తుల విషయంలో ఆచి తూచి వ్యవహరించమని సున్నితంగా మందలించాడు.

పురాణంలో అత్యద్భుతమైన ఘట్టంగా కనిపించే ఈ సంఘటన తమిళనాడులోని 'తిరుకడవూరు'లో జరిగిందని చెబుతుంటారు. ఈ కారణంగానే ఇక్కడి శివుడిని 'కాలసంహార మూర్తి' పేరుతో పూజిస్తూ వుంటారు. ఇక్కడ శివుడి కాళ్ల క్రింద నలుగుతున్నట్టుగా యమధర్మరాజు ... ఆ పక్కనే శివుడికి వినయంగా నమస్కరిస్తూ మార్కండేయుడు దర్శనమిస్తూ ఉంటారు. ప్రాచీనకాలానికి చెందిన ఈ క్షేత్రానికి 'కార్తీక సోమవారం' రోజున వేలాదిమంది భక్తులు వస్తుంటారు.

ఈ రోజున ఇక్కడ ఒకవెయ్యి ఎనిమిది శంఖాలతో స్వామివారికి జరిగే అభిషేకం చూసితీరవలసిందే. ఇక అమ్మవారు 'అభిరామి' పేరుతో విశేష పూజలు అందుకుంటూ వుంటుంది. కార్తీక సోమవారం రోజున ఈ క్షేత్రాన్ని దర్శించినవారిని యమధర్మరాజు సైతం ఏమీ చేయలేడనీ, విధివశాత్తు ఆపదలు ఎదురైనా మృత్యుంజయులుగా బయటపడతారని భక్తులు విశ్వసిస్తూ వుంటారు. అందువలన ఈ రోజున వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఈ క్షేత్రానికి వస్తుంటారు ... స్వామి అనుగ్రహాన్ని పొందుతూ వుంటారు.

More Bhakti Articles