సత్యవ్రత మహాత్మ్యం

సత్యవ్రత మహాత్మ్యం
కార్తీకమాసానికి సమానమైన మాసం మరొకటి లేదని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో ఆచరించదగిన వ్రతాలలో శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం విశిష్టమైనదిగా చెప్పబడుతోంది. సత్యనారాయణస్వామిని త్రిమూర్తుల శక్తిస్వరూపంగా భావిస్తుంటారు.

మానవులలోగల కామ .. క్రోధ .. లోభ .. మోహ .. మద .. మత్సరాలను హరించివేయడానికే శ్రీ సత్యనారాయణ స్వామి అవతరించాడు. సత్యవంతులుగా ధర్మ మార్గంలో ప్రజలను నడిపించడం కోసమే 'అన్నవరం' లోని 'రత్నగిరి' పై ఆవిర్భవించాడు. తొలిసారిగా సత్యనారాయణస్వామివారిని దర్శించుకున్న సీతారాములు, ఆయన అనుగ్రహాన్ని ఆశిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించారు.

వ్రతానికి అవసరమైన సామాగ్రిని లక్ష్మణుడు - హనుమంతుడు సమకూర్చగా, నారదమహర్షి ఈ వ్రతాన్ని దగ్గరుండి జరిపించాడు. ఆయనే ఈ వ్రత విధానాన్ని దశదిశలా వ్యాపింపజేశాడు. అది మొదలు ఇది దంపత సమేతంగా ఆచరించదగిన వ్రతంగా ప్రసిద్ధి చెందింది. ఆనాటి నుంచి కొత్త దంపతులతో కలిసి కుటుంబ సభ్యులు సత్యనారాయణస్వామి వ్రతం చేసుకోవడం ఆనవాయతీగా వస్తోంది.

ఇక కార్తీకమాసంలో సామూహిక సత్యవ్రతాలు ఎక్కువగా జరుగుతూ వుంటాయి. ఈ వ్రతాన్ని ఎవరికి వారు జరుపుకున్నా, సామూహికంగా జరుపుకున్నా భక్తి శ్రద్ధలు ... నియమనిష్టలు ముఖ్యమని చెప్పడం జరిగింది. సత్యదేవుడి వ్రతం కనుక, అనుకున్నామంటే తప్పనిసరిగా ఆ మాట నిలుపుకోవలసిందే. లేదంటే అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఇదే విషయం మనకి వ్రత కథల్లో కనిపిస్తూ వుంటుంది.

అరిషడ్వర్గాలకు రూపాలను కల్పించి ఆ పాత్రల ద్వారా కథలను నడిపించి తన వ్రత మహాత్మ్యాన్ని గురించి ఆయన లోకానికి చాటిచెప్పాడు. సత్యనారాయణస్వామి పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేయని వారు ... కష్టాల్లో ఆయనని విశ్వసించి అవి తీరగానే మరిచిపోయేవారు ... వ్రతం జరుగుతున్న ప్రదేశానికి అహంభావంతో వెళ్లని వారు ... ప్రసాదం తీసుకోకుండా వెళ్లిపోయేవారు ఎలాంటి కష్టనష్టాలను ఎదుర్కోవలసి వస్తుందనేది ఈ వ్రత కథలు చెబుతుంటాయి.

వ్రత కథల్లో గల నీతిని గ్రహించి ఎవరికీ వారు తమ పద్ధతిని మార్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నియమం చెప్పబడింది. సత్యనారాయణస్వామిని భక్తి శ్రద్ధలతో కొలిచిన వారు అష్టైశ్వర్యాలతో తులతూగుతూ వుంటారు. ఆయన త్రిమూర్తి స్వరూపుడు కనుక కార్తీక మాసంలో ఆయనని పూజించడం వలన, బ్రహ్మ .. విష్ణు .. మహేశ్వరులను ఆరాధించిన ఫలితం కలుగుతుంది.

కార్తీక మాసంలో సత్యనారాయణస్వామి వ్రతం చేయడం వలన వెయ్యి తపస్సులు ... లక్ష దానాలు ... కోటి యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుందని సాక్షాత్తు త్రిమూర్తులే చెప్పారు. ఈ కారణంగానే ఈ మాసంలో అంతా సత్యవ్రతాలను నిర్వహిస్తుంటారు ... స్వామి కరుణాకటాక్ష వీక్షణాలలో తరిస్తూ వుంటారు.

More Bhakti Articles