ప్రబోధన ఏకాదశి ప్రత్యేకత

ప్రబోధన ఏకాదశి ప్రత్యేకత
శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనది కార్తీకమాసం. పవిత్రతకు ప్రతీకగా కనిపించే ఈ మాసంలో ప్రతిరోజూ ఓ పండుగే ... ప్రతి రోజూ ఓ పర్వదినమే. ఈ నేపథ్యంలో వచ్చేదే 'ప్రబోధన ఏకాదశి'. కార్తీక శుద్ధ ఏకాదశినే ప్రబోధన ఏకాదశి అని అంటారు. దీనినే 'ఉత్థాన ఏకాదశి' అని కూడా పిలుస్తుంటారు.

తొలి ఏకాదశి (ఆషాఢ శుద్ధ ఏకాదశి) రోజున యోగ నిద్రలోకి జారుకున్న శ్రీ మహావిష్ణువు, ప్రబోధన ఏకాదశి రోజున మేల్కొంటాడు. ఈ రోజుతోనే 'చాతుర్మాస్య వ్రతం' పూర్తవుతుంది. ప్రబోధన ఏకాదశి రోజున ఉపవాస దీక్షను చేపట్టి శ్రీ మహావిష్ణువును పూజిస్తూ ... జాగరణ చేస్తూ ఏకాదశ వ్రతాన్ని ఆచరించవలసి వుంటుంది.

ఈ వ్రతాన్ని ఆచరించి ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం వలన, అశ్వమేథ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది. అలాగే ఈ రోజున శివుడిని ఆరాధించడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు. ఈ రోజున తనని పూజించిన వారిని తాను ఎంత త్వరగా అనుగ్రహిస్తాననే విషయాన్ని సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవితో చెప్పాడట. శివకేశవుల అనుగ్రహాన్ని అవలీలగా అందించగలిగే ప్రత్యేకతను ... విశిష్టతను సంతరించుకుని ఈ ప్రబోధన ఏకాదశి కనిపిస్తూ వుంటుంది.

అలాంటి ఈ పుణ్య దినాన ఎవరికి తోచిన స్థాయిలో వాళ్లు దానాలు చేయాలని చెప్పబడుతోంది. ఈ రోజున కనీసం ఒక్కరికైనా వస్త్రదానం చేయాలని అంటారు. అందువలన కలిగే పుణ్య ఫలం వచ్చే జన్మలోను వెంట వస్తుందనీ, సుఖ సంతోషాలను ఇస్తుందని అంటారు.

More Bhakti Articles