పావురాల ప్రదక్షిణ!

పావురాల ప్రదక్షిణ!
గరుడపక్షి ... నెమలి ... చిలుక ... హంస ... కాకి ... ఇలా వివిధ రకాల పక్షులు దేవతలకు వాహనాలుగా దర్శనమిస్తూ వుంటాయి. ఆయా దేవతలు కొలువుదీరిన ఆలయాలలో మూలమూర్తులకు ఎదురుగా ఈ వాహనాలు కనిపిస్తుంటాయి. ఈ కారణంగానే పక్షులను ప్రేమిస్తూ వుండటం ... వాటికి అవసరమైన పోషకాలను అందిస్తూ ఉండటాన్ని పుణ్యప్రదంగా భావిస్తుంటారు.

ఆయా దేవతలకు ... ఆయా పక్షులకు మధ్య సంబంధం ఉందనే విషయాన్ని నిరూపించే ఎన్నో సంఘటనలు కళ్ళ ముందు కదలాడుతూ వుంటాయి. ముఖ్యంగా శబరిమలలో 'మకరజ్యోతి' దర్శనం రోజున రాజ వంశీకుల అధీనంలో గల స్వామివారి వస్త్రాలను తీసుకువచ్చే సమయంలో, ఆకాశమార్గాన ఓ గరుడపక్షి ఆ ఉత్సవాన్ని వెన్నంటే వస్తూ వుంటుంది. ప్రతి ఏడాది ఈ రోజున గరుడపక్షి ఈ మార్గంలో రావడాన్ని మహిమాన్వితమైన సంఘటనగా చెబుతుంటారు.

అదే విధంగా ఆలయం చుట్టూ పావురాలు ముమ్మారు ప్రదక్షిణ చేసే దృశ్యం మనకి తూర్పుగోదావరి జిల్లాలోని 'సర్పవరం' క్షేత్రంలో దర్శనమిస్తూ వుంటుంది. పంచ భావనారాయణ స్వామి క్షేత్రాల్లో ఒకటిగా చెప్పబడుతోన్న ఈ ఆలయంలో రాజ్యలక్ష్మీ సమేత భావనారాయణుడు దర్శనమిస్తూ వుంటాడు. పూర్వం పిఠాపురం రాజావారు తన బంగ్లా పైభాగం నుంచి చూస్తే కనిపించేంత ఎత్తులో సర్పవరం ఆలయ గోపురాన్ని నిర్మించాడు. ఎత్తైన ఈ గోపురంపై వందలాది పావురాలు నివసిస్తూ వుంటాయి.

ఇవన్నీ కూడా కూడబలుక్కున్నట్టుగా ప్రతిరోజూ ఉదయం వేళలోను ... సాయంత్రం వేళలోను గుంపుగా స్వామివారి ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఆ తరువాత గోపురంపై గల గూళ్లలోకి చేరుకుంటాయి. ఈ దృశ్యాన్ని తిలకించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఒక నిర్ణీత సమయంలో పావురాలన్నీ ఇలా ఆలయం చుట్టూ ప్రదక్షిణలుచేయడం మహిమాన్వితమైన సంఘటనగా అనిపిస్తుంది ... అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది.

More Bhakti Articles