అమ్మవారి దర్శనం !

అమ్మవారి దర్శనం !
వెంగమాంబ పట్ల అసూయతో వున్నకొందరు ఆమె గురించి పుష్పగిరి పీఠాధిపతి అయిన విద్యా నృసింహ భారతికి ఫిర్యాదు చేస్తారు. భర్త చనిపోయినా తలనీలాలు తీయడం లేదనీ, బొట్టూ ... గాజులు ధరిస్తోందని చెబుతారు. తరతరాలుగా వస్తోన్న హిందూ సంప్రదాయాన్ని ఆమె వ్యతిరేకిస్తుందని అంటారు.

ఆ మాటలు నమ్మిన పీఠాధిపతి ... పెద్దమనుషుల సమక్షంలోకి వెంగమాంబను పిలిపిస్తాడు. భర్తను కోల్పోయిన ఆమె వైధవ్యాన్ని అంగీకరించక పోవడం, ఆచరించకపోవడం పట్ల తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. వెంటనే ఆమె జుట్టు తీసేయాలనీ ... లేదంటే గ్రామం నుంచి వెలి వేయవలసి వస్తుందని అంటాడు.

శిరోముండనం చేయించుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నాననీ, అయితే ఆ తరువాత తన తలపై జుట్టు మొలవకుండా చేయమని కోరుతుంది వెంగమాంబ. ఆ మాటకి ఆయన ఆశ్చర్యపోవడమే కాకుండా ఆలోచనలో పడతాడు. ఏదేవైనా ఆమెకి అంత అహంకారం పనికిరాదనీ, తనకి నమస్కరించకపోవడమే అందుకు నిదర్శనమని అంటాడు.

పెద్దలపట్ల తనకి ఎప్పుడూ గౌరవ భావమే ఉంటుందనీ, అయితే తాను నమస్కరించక పోవడానికి కారణముందని అంటుంది వెంగమాంబ. అదేమిటో చెప్పమని అడుగుతాడు పీఠాధిపతి. ఒక్కసారి ఆయనని తప్పుకోమని చెప్పి, ఆయన కూర్చున్న ఆసనానికి నమస్కరిస్తుంది వెంగమాంబ. అంతే ఒక్కసారిగా అది పెద్దగా శబ్దం చేస్తూ ముక్కలైపోతుంది.

ఈ దృశ్యం చూసిన గ్రామస్తులు బిత్తరపోతారు. ఆమె ధోరణి గురించి ఫిర్యాదు చేసిన వాళ్లు భయపడిపోతారు. వెంగమాంబ దైవాంశ సంభూతురాలనే విషయం తెలుసుకున్న పీఠాధిపతి, ఆ విషయం అక్కడి వారికి చెబుతాడు. ఆమెలో తనకి శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు దర్శనమిచ్చిందని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి బయలుదేరతాడు.

More Bhakti Articles