పామర్రు రఘురాముడు

పామర్రు రఘురాముడు
శ్రీరామచంద్రుడు తన వ్యక్తిత్వంతో మానవులను ... మహర్షులను ... దేవతలను ప్రభావితం చేశాడు. యుగాలు గడిచినప్పటికీ రామరాజ్య వైభవం గురించి ఈనాటికీ చెప్పుకుంటారు. అంతలా రాముడు ధర్మ మార్గాన్ని అనుసరించి ... ఆచరించి చూపించాడు. విశ్వమానవ కల్యాణం కోసం ఇటు ప్రశాంతతను ... అటు పరాక్రమాన్ని సమపాళ్లలో ప్రదర్శించిన ఘనత శ్రీరాముడి సొంతం.

అలాంటి రాముడు అనేక క్షేత్రాల్లో కొలువై భక్తులచే పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు. కృష్ణా జిల్లా పామర్రులో విలసిల్లుతోన్న శ్రీరామాలయం ఈ నేపథ్యంలోనిదే. వివిధ దేవతా ప్రతిమలతో ఆలయం చూడముచ్చటగా కనిపిస్తూ వుంటుంది. గర్భాలయంలో సీతారామ లక్ష్మణులు చలువరాయి మూర్తులుగా దర్శనమిస్తూ వుంటారు. మూలమూర్తులలో జీవకళ ఉట్టిపడుతూ భక్తులను మంత్ర ముగ్ధులను చేస్తుంటాయి.

ఇదే ప్రాంగణంలో హనుమంతుడి ఆలయం దర్శనమిస్తూ వుంటుంది. నిలువెత్తు హనుమంతుడి విగ్రహం చూస్తుంటే నిజంగానే హనుమంతుడు మన ఎదురుగా నుంచున్నట్టు అనిపిస్తుంది. మండల కాలంపాటు హనుమంతుడి దీక్ష తీసుకునే భక్తులు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ వుంటారు. ఇక ఆ పక్కనే శివాలయం ... బాబా మందిరం కూడా దర్శనమిస్తుంటాయి.

శ్రీరామనవమి ... హనుమజ్జయంతి ... శివరాత్రి ... గురుపౌర్ణమి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతూ వుంటాయి. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు ... దైవ సన్నిధానంలో ధన్యులవుతుంటారు.

More Bhakti Articles