కేన్సర్ నయంచేసిన దైవం

కేన్సర్ నయంచేసిన దైవం
ఆనందంగా ... ఆరోగ్యంగా ఉన్నంత వరకూ దైవాను గ్రహాన్ని గురించి ఆలోచించే వారు చాలా తక్కువ. ఇక ఆరోగ్యం విషయంలో తీవ్రమైన సమస్య ఏర్పడినప్పుడు అసలైన బంధువు ఆ భగవంతుడేనని అనిపిస్తుంది. ఆయన చిత్రపటాలు గానీ ... ప్రతిమలుగాని ఎక్కడైనా కనిపిస్తే చాలు, అనేక విధాలుగా ఆయన్ని ప్రశ్నించాలనిపిస్తుంది. ఆయన స్మరణలో .. ఆయన సేవలో ఎక్కువసేపు గడపాలనిపిస్తుంది.

ఈ ప్రపంచంలో ప్రశాంతత అనేది ఎక్కడైనా వుందంటే అది దైవ సన్నిధిలోనేననిపిస్తుంది. ఇలాంటి అనుభూతే బాపూ కులకర్ణి అనే వ్యక్తికి కలిగింది. ఎందుకంటే ఆయన కేన్సర్ వ్యాధి బారినపడ్డాడు. ఆ సమయంలో ఆయనకి 'గాణుగాపురం' లోని దత్తపాదుకల చెంత ప్రశాంతత చిక్కింది. దత్తస్వామి పై ఆయన ఎన్నో అభంగాలను రచించాడు.

అయితే ప్రతి అభంగంలోను నాల్గవ పాదం మాత్రం పూర్తిచేయలేకపోయాడు. అలా ఎందుకు జరుగుతుందో తెలియక ఆయన సతమతమైపోసాగాడు. ఈ నేపథ్యంలో ఒక రోజున శ్రీ దత్తాత్రేయస్వామి ఆయనకి స్వప్నంలో కనిపించి, 'అక్కల్ కోట మహారాజ్' ని కలిస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పాడు. దాంతో ఆయన తాను రాసిన అభంగాలను తీసుకుని అక్కల్ కోట స్వామి చెంతకి చేరుకున్నాడు.

ఆయనని చూడగానే అక్కల్ కోట స్వామి అంతకు ముందు తమ మధ్య చాలా పరిచయం వుందన్నట్టుగా పలకరింపుగా నవ్వాడుట. వచ్చినపని పూర్తయ్యేంత వరకూ తన దగ్గరే ఉండమని చెప్పాడు. అయన అనుగ్రహంతో బాపూ కులకర్ణి అభంగాలన్నింటికి నాల్గవపాదం పూర్తి చేయగలిగాడు. చివరి అభంగం పూర్తి చేసేవరకూ తాను ఉంటానో లేదోనని అనుకున్న ఆయనకి, ఆ అభంగం పూర్తి చేసే సరికి అసలు కేన్సర్ అనేది లేకుండా పోయింది.

వైద్యులు ఈ విషయాన్ని నిర్ధారణ చేయడంతో ఆయన సంతోషంతో పొంగిపోయాడు. కన్నీళ్లతో అక్కల్ కోట్ స్వామి పాదాలపై పడి మనసు కుదుటపడేంత వరకూ అక్కడి నుంచి లేవలేకపోయాడు. భగవంతుడు ఇచ్చిన ఆయుష్షును ఆయన సేవకే ఉపయోగించాలనే ఉద్దేశంతో, ఆ తరువాత కూడా అక్కల్ కోట్ లోనే ఉండిపోయాడు.

More Bhakti Articles