లక్ష్మీదేవి అనుగ్రహం

లక్ష్మీదేవి అనుగ్రహం
లక్ష్మీదేవి అనగానే ... సరస్సులోని కమలంపై ప్రశాంతంగా కూర్చుని, చిరునవ్వులు చిందిస్తూ సిరులు కురిపిస్తూ వుండే అమ్మవారి రూపం గుర్తుకు వస్తుంది. నీటిపై గల కమలం కదులుతూ వుంటుంది. అందువల్లనే ఆమెకి చెంచల స్వభావం అలవడి ఉంటుందని కొందరు అనుకుంటూ వుంటారు. మరి కొందరు అసలు కమలంలో అమ్మవారు కూర్చోవడానికి కారణమేమిటో తెలుసుకోవడానికి ఆసక్తిని చూపుతుంటారు.

నవనిధుల్లో 'మహా పద్మనిధి' ... 'పద్మనిధి' అమ్మవారి అధీనంలో వుంటాయి. ఈ కారణంగానే అమ్మవారు పద్మం (కమలం)లో కొలువై వుంటుంది. సూర్యుడి కిరణాలు సోకడంతోనే కమలం విప్పారుతూ వుంటుంది ... సూర్యాస్తమయానికి అది ముడుచుకుపోతుంది. సూర్యనారాయణమూర్తి పేరుతో ప్రకాశిస్తోన్న తన భర్త అయిన శ్రీ మహావిష్ణువు వెలుగులు వెదజల్లినంత వరకే వికసిస్తూ వుండే కమలాన్ని అమ్మవారు ఎంతగానో ఇష్టపడుతూ వుంటుంది ... అందుకోసమే ఆమె దానిని ఆసనంగా చేసుకుందని అంటారు.

ఇక సూర్యకిరణాలు సోకుతూ వుండటం వలన మెల్లమెల్లగా కమలం రేకులు ఎలా విచ్చుకుంటూ ఉంటాయో, నిశ్చలమైన భక్తితో అమ్మవారిని పూజిస్తూ వుండటం వలన ఆమె అనుగ్రహం కూడా అలాగే కలుగుతూ వుంటుందని చెబుతారు. ఈ నేపథ్యంలో అమ్మవారి చిత్రపటాలను పూజించేవారు, అందులో అమ్మవారి పాదాలు కనిపించేలా ఉండాలా ... లేదా ? అనే సందేహాలకు లోనవుతుంటారు. శాస్త్రం మాత్రం పాదాలు కనిపించేలా వుండే అమ్మవారినే ఆరాధించాలని చెబుతోంది.

ఇంకొందరేమో అప్పులపాలైన తాము అమ్మవారి అనుగ్రహాన్ని పొందడమెలాగో తెలియక సతమతమైపోతుంటారు. అయితే అప్పులబారి నుంచి బయటపడాలనుకునే వారు, దీపావళి రోజు రాత్రి ఎర్రని వస్త్రాలు ధరించి అమ్మవారి పూజ చేసుకోవాలని శాస్త్రం చెబుతోంది. ఈ విధంగా చేయడం వలన అమ్మవారు కరుణిస్తుందనీ, ఆ సమస్య నుంచి వారిని త్వరలోనే గట్టెక్కిస్తుందని స్పష్టం చేస్తోంది.

More Bhakti Articles