భక్తుడిని ఆహ్వానించిన భగవంతుడు

భక్తుడిని ఆహ్వానించిన భగవంతుడు
తంజావూరు రఘునాథనాయకుడి ఆహ్వానం మేరకు ఆయన ఆస్థానాన్ని దర్శిస్తాడు క్షేత్రయ్య. అక్కడి ఆస్థాన పండితులతో ఆయన సాహిత్య చర్చలు జరుపుతాడు. మాటల సందర్భంలో శ్రీరంగనాథుడి దర్శనభాగ్యం తమకి లేదనీ, అది తమ శత్రువులైన మధుర రాజుల ఏలుబడిలో ఉండటమే అందుకు కారణమని రఘునాథనాయక రాజు ఆవేదన వ్యక్తం చేస్తాడు. దాంతో సామరస్యంగా ఈ సమస్యను పరిష్కరించి, రఘునాథనాయక రాజుకి శ్రీరంగనాథుడి దర్శనభాగ్యం లభించేలా చేయాలని క్షేత్రయ్య నిర్ణయించుకుంటాడు.

శ్రీరంగనాథ ఆలయానికి మధుర రాజైన పద్మనాభుడు వచ్చాడని తెలిసి క్షేత్రయ్య అక్కడికి వెళతాడు. ఆ సమయంలో ముఖమంటపంలో నుంచుని గర్భాలయంలో గల స్వామివారి మూర్తిని పద్మనాభుడు దర్శించుకుంటూ ఉంటాడు. ఆయనని కలుసుకోవడానికి వీల్లేదంటూ ఆలయ ద్వారం దగ్గరే క్షేత్రయ్యని రాజభటులు అడ్డుకుంటారు. ఆయనని ఎలాగైనా కలుసుకోవాలనీ ... మాట్లాడాలని అనుకున్న క్షేత్రయ్య శ్రీ రంగనాథుడిని ఆశువుగా స్తుతిస్తాడు.

గర్భాలయంలోని మూలమూర్తికి అలంకరించబడిన పూలమాల దానంతట అది గాలిలో తేలుతూ వచ్చి క్షేత్రయ్య కంఠాన్ని అలంకరిస్తుంది. ఆ పూలమాల వెనకే అక్కడికి వచ్చిన పద్మనాభుడు వినయంగా క్షేత్రయ్యకి నమస్కరిస్తాడు. స్వామివారే స్వయంగా ఆయనకి ఆహ్వానం పలికాడంటూ ఆలయ మర్యాదలతో దర్శనం చేయిస్తాడు. తంజావూరు రఘునాథ నాయక రాజుకి తనకి మధ్య స్నేహ సంబంధాన్ని పెంపొందించడానికి క్షేత్రయ్య వచ్చినట్టుగా పద్మనాభుడు తెలుసుకుంటాడు.

క్షేత్రయ్య వంటి మహాభక్తుడి మాట కాదనలేక,రఘునాథ నాయక రాజుతో మైత్రితో మెలగడానికి పద్మనాభుడు ఆనందంగా అంగీకరిస్తాడు. అలా క్షేత్రయ్య కారణంగా తంజావూరు ... మధుర రాజుల మధ్య శత్రుత్వం తొలగిపోయి స్నేహ సంబంధాలు ఏర్పడ్డాయి. ఫలితంగా రెండు రాజ్యాలు పరస్పర సహాయ సహకారాలతో అభివృద్ధిని సాధించాయి.

More Bhakti Articles